YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశంలో టీడీపీ అడ్రస్ ఎక్కడ

 ప్రకాశంలో టీడీపీ అడ్రస్ ఎక్కడ

ఒంగోలు, ఏప్రిల్ 10, 
ప్రకాశం జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం చీరాల‌. ఇక్కడ టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన నాయ‌కులు పార్టీని ప‌ట్టించుకోవ‌డం మానేసి.. వ్యక్తిగ‌త విష‌యాలు, వ్యాపారాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్కడ పార్టీని ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లోల ఇక్కడి నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం కూడా పార్టీని వీడి.. వైసీపీకి మ‌ద్దతుగా మారారు. పైకి ఈయ‌న వైసీపీలోనే ఉన్నా.. టీడీపీ నేత‌గానే చ‌లామ‌ణి అవుతున్నార‌ని అంటారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఇలాంటి చ‌ర్యల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ అంగీక‌ర‌రించ‌రు క‌నుక‌.. ఆయ‌న భ‌యం భ‌యంగానే ఉన్నారు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలోకి వెళ్లిపోయారు.ఇక‌, ప్రస్తుతం టీడీపీకి చీరాల ఇంచార్జ్‌గా ఎడ‌ం బాలాజీ ఉన్నారు. అయితే.. ఈయ‌న మూలాలు వైసీపీలోనే ఉన్నాయి. అమెరికాలో సాఫ్ట్‌వేర్ సంస్థ నడిపే బాలాజీ రాజకీయాలపై ఆసక్తితో 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అనంత‌రం జ‌గ‌న్‌ను మ‌చ్చిక చేసుకుని 2014 వైసీపీ టిక్కెట్ సంపాదించారు. అయితే.. అప్పటి ఎన్నిక‌ల్లో ఆమంచి కృష్ణమోహన్‌ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత చీరాలలో బాలాజీయే వైసీపీకి పెద్ద దిక్కు అయ్యారు. 2019 ఎన్నికల్లో బాలాజీ మరోసారి పోటీకి సిద్ధమైనా.. ఆయ‌న దూకుడుపై వైవీ సుబ్బారెడ్డి వంటివారు ఫిర్యాదు చేయ‌డంతో ప‌క్కకు త‌ప్పించారు. ఈ స‌మ‌యంలోనే వైసీపీలో చేరిన ఆమంచి టికెట్ ద‌క్కించుకున్నారు.అయితే టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత కరణం బలరాం చేతిలో ఆమంచి ఓడిపోయారు. ఇక టీడీపీలో ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం వైసీపీలోకి వెళ్లిపోయారు. టిక్కెట్ రాక‌పోవ‌డంతో ఎన్నిక‌ల‌కు ముందే బాలాజీ వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో టికెట్ ఇవ్వలేన‌ని చెప్పిన చంద్రబాబు వెంట‌నే చీరాల ఇంచార్జ్ పోస్టు ఇచ్చారు. ప్రస్తుతం చీరాల టీడీపీలో బాలాజీ ఒక్కరే మిగిలారు. ఏడాదిగా ప్రతిపక్ష పార్టీ కార్యకలాపాలను ఆయనే నిర్వహిస్తున్నారు. వాస్తవానికి చీరాలలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. పోతుల సునీత‌, క‌ర‌ణం, పాలేటి రామారావు.. వంటివారు చ‌క్రం తిప్పారు. అయితే.. వీరంతా వైసీపీలో చేరిపోయారు. దీంతో బాలాజీ కూడా ఇప్పుడు సంస్థాగ‌తంగా టీడీపీని బ‌లోపేతం చేయ‌డం క‌ష్టమ‌ని బావించిన‌ట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. ఇక‌, చీరాల‌లో టీడీపీకి అడ్రస్ లేకుండా చేయాల‌ని భావిస్తున్న వైసీపీ.. బాలాజీ వ‌స్తే.. చేర్చుకునేందుకు రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది. బాలాజీకి మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి మధ్య స్నేహం ఉండ‌డంతో ఆయ‌న‌ను చేర్చుకునేందుకు జ‌గ‌న్ అడ్డు చెప్పర‌ని కూడా ప్రచారం జ‌రుగుతోంది. ఇదే జ‌రిగితే.. టీడీపీ అడ్రస్ గ‌ల్లంతేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related Posts