YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

భద్రాద్రిలో ఎయిర్ పోర్టు ఆశలు

భద్రాద్రిలో ఎయిర్ పోర్టు ఆశలు

ఖమ్మం, ఏప్రిల్ 10, 
భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అడ్డంకులు తొలగుతున్నాయా? జిల్లావాసుల ఆశలు చిగురించేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సర్వే చేసిన ఎయిర్‌పోర్టు అథారిటీ (ఏఏఐ) అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడు చెలక గ్రామం వద్ద 1,600 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఆ ప్రాంతం అభయారణ్యం పరిధిలోకి రావడంతో భూ సేకరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. తాజాగా పాల్వంచ మున్సిపాలిటీ గుడిపాడు, బంగారుజాల ప్రాంతాల్లోని 990 సర్వే నంబర్‌లో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని ఇటీవల కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తహసీల్దార్‌తో కలిసి పరిశీలించారు. ఏఏఐ అధికారులతో చర్చించారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతో కాలుష్యపరంగా అవరోధాలుంటాయా అనే అంశాన్ని పరిశీలించారు.విమానాశ్రయ స్థల పరిశీలన కోసం ఏఏఐ అధికారుల బృందం కొత్తగూడెం జిల్లాలో శనివారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ బృందానికి ఆర్‌అండ్‌బీ ఈఈ బీమ్లా సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కు చేరుకున్న బృందం స్థల పరిశీలన, వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తోంది. ఆదివారం పాల్వంచలోని గుడిపాడు ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నారు. ఈ ప్రాంతం అనువుగా ఉంటే ఇక్కడే విమానాశ్రయం ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి రావడంతో సంబంధిత అధికారులు విమానాశ్రయ స్థలం కోసం ఇప్పటికే పలుమార్లు సర్వే చేశారు. శంషాబాద్‌ నుంచి 310 కిలో మీటర్లు దూరం ఉండడంతో ఈ ప్రాంతానికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని భావిస్తున్నారు. తాజాగా పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. 2016లో రైట్స్‌ అనే సంస్థ పునుకుడు చెలక ప్రాంతంలో సర్వే చేసి నివేదిక ఇచ్చింది. 2019 ఆగస్టు 20న ఏఏఐ ఆధ్వర్యంలో త్రిసభ్య బృందం రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి ప్రాంతాల్లోనూ పర్యటించింది. 2020 ఆగస్టు 18న ఆరు ప్రతిపాదిత విమానాశ్రయాల పరిసర ప్రాంతాల్లో గరిష్ఠ వరదల స్థాయి నివేకదిను కోరుతూ ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్‌ చీఫ్‌కు లేఖ రాశారు. ఇందులో వరంగల్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలోని వసంత్‌నగర్‌, మహబూబూనగర్‌లోని దేవరకద్ర, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లిలో విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు నివేదిక అందించారు. సర్వే చేసిన అనంతరం కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించవచ్చని ఏఏఐ తేల్చింది.ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు చివరకు పాల్వంచ గుడిపాడు ప్రాంతంలో పర్యటన చేయనుండడంతో జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలో అశ్వాపురం హెవీవాటర్‌ ప్లాంట్‌, సింగరేణి, సారపాక బీపీఎల్‌, పాల్వంచ ఎన్‌ఎండీసీ, నవభారత్‌ పరిశ్రమల అధికారులు ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉండడంతో వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే బాగుటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts