పూర్తి వివరాలతో త్వరలో పుస్తక ముద్రణ
హిందువుల ఆరాధ్యదైవం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల హనుమంతుని జన్మస్థానంగా కూడా గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది నాడు ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు టిటిడి సిద్ధమైంది.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఈ విషయంపై కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కమిటీలోని పండితులు జ్యోతిష శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో ఉగాది నాడు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. హనుమంతుని జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో సమగ్రమైన పుస్తకాన్ని తీసుకురావాలన్నారు.
అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబరులో టిటిడి పండితులతో ఒక కమిటీని ఏర్పాటుచేసిన విషయం విదితమే. ఈ కమిటీలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. టిటిడి ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ కమిటీలోని పండితులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి లోతుగా పరిశోధన చేసి హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించారు. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్యం గ్రంథం, వరాహమిహిరుని బృహత్‌సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వరస్వామివారి చెంత గల అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు.