YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కలకలం రేపుతున్న కానిస్టేబుల్ ఆరోపణలు

కలకలం రేపుతున్న కానిస్టేబుల్ ఆరోపణలు

ఇసుక, కిరోసిన్‌, రేషన్‌ బియ్యం దందాలతో పాటు ఇతర దందాల నుంచి పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తనను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సీఐ వేధిస్తున్నాడంటూ ఓ కానిస్టేబుల్‌ వీడియో చిత్రీకరించి తెలంగాణ రాష్ట్ర పోలీసు వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా రాజ్‌కుమార్‌ (పీసీ నెం. 3390) పనిచేస్తున్నాడు. ఈ నెల 17, 18 తేదీల్లో ఆరవ బీట్‌లో నైట్‌డ్యూటీ వేశారు. అక్రమంగా కిరోసిన్‌ తరలిస్తున్న వాహనాన్ని రాజ్‌కుమార్‌ అడ్డుకున్నాడు. సీఐ సాయిఈశ్వర్‌గౌడ్‌కు కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ ఈ విషయం ఫోన్‌ద్వారా తెలిపాడు. 'ఎందుకు ఆపావు? వదిలేయి' అంటూ గద్దించాడు. పైగా ఈ నెల 19, 20, 21 తేదీల్లో మూడో బీట్‌లో వరుసగా డ్యూటీ వేసేలా చూశాడు. ఒక కానిస్టేబుల్‌కు వరుసగా ఒకే బీట్‌లో డ్యూటీలు వేయడం విరుద్ధం. 'ఈ నెల 22న పోలీస్‌స్టేషన్‌లో రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున ఒంటిగంట వరకూ వాచ్‌ డ్యూటీ చేశా. 1.15 గంటలకు ఇంటికెళ్లా. 1.30 గంటలకు తన రికార్డు బుక్‌లో గైర్హాజరైనట్టు రాశారు' అని కానిస్టేబుల్‌ ఆరోపించాడు. 'ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది ఉదయం, సాయంత్రం వేళల్లో పది నిమిషాల్లో రూల్‌కాల్‌ వేయాల్సి ఉంది. కానీ రాత్రి తొమ్మిది గంటల నుంచి 11.30 గంటల వరకూ సిబ్బందిని సీఐ తన రూమ్‌లో ఉంచుకుని సమయాన్ని వృథా చేస్తున్నాడు. ఆ సమయంలోనే పట్టణంలో ఇసుక అక్రమ డంపింగ్‌ జరుగుతుంది. దానిని అడ్డుకోకుండా ఉండేందుకే సీఐ ఇలా చేస్తున్నాడు. దానికి నేను సహకరించట్లేదు. దీంతో సీఐ నన్ను మానసికంగా వేధిస్తున్నాడు' అంటూ వీడియోలో పేర్కొనడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే తరహాలో అన్ని పోలీస్‌స్టేషన్‌లో నెలవారీ మామూళ్లు సాగుతున్నాయని, అక్రమ దందాను అడ్డుకున్న సిబ్బందిని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోకుండా సిబ్బందిని బాధ్యులుగా చేయడం సరికాదని వాపోయాడు.

Related Posts