అక్రూరుడు శ్రీ కృష్ణ పరమాత్మ కి పరమభక్తుడు, అత్యంత సన్నిహితుడు. అక్రూరుడు ఒకసారి ద్వారకకి వెళ్ళిన సమయంలో సత్యభామ ఆయనతో , " శ్రీ కృష్ణుడు నా భవనానికి వచ్చి చాలా కాలమైనది. మీరు ఆయన వద్దకి వెళ్ళి నేను ఎదురుచూస్తున్నానని చెప్పండి. ఇంక ఒక ఘడియలో కృష్ణుడు రాకపోతే నేను ప్రాణాలు త్యజిస్తానని " అని అన్నది. అక్రూరుడు తక్షణమే కృష్ణుని పిలుచుకుని రావడానికి వెళ్ళాడు. లీలావినోదుడైన కృష్ణుని మాయలవలన ఆయన ఎక్కడ వెతికినా కనపడలేదు. ఘడియ దాటిపోతే సత్యభామ అన్నంతపని చేసి తన ప్రాణాలను త్యజిస్తుందేమోనని భయపడ్డాడు అక్రూరుడు. వెంటనే తానే కృష్ణునిగా మారి సత్యభామ వద్దకు వెళ్ళి " రాచకార్యాలలో నిమగ్నమైవున్నాను. అవి పూర్తిచేసుకుని నేనే నీ మందిరానికి వస్తాను" అని శ్రీ కృష్ణుడు చెప్తున్నట్టుగా చెప్పి వెలుపలికి వెళ్ళి పోయాడు అక్రూరుడు. సత్యభామ అంతఃపురం నుండి బయటకు రాగానే ఎదురుపడిన శ్రీ కృష్ణునితో తాను చేసిన పని చెప్పాడు. శ్రీకృష్ణుడు అక్రూరుడు చెప్పినది విని " భామ మొండిపట్టుదల తప్పు.ఆమెను సంతుష్టురాలను చేయడానికి నీవు చేసిన తంత్రము తప్పు. ఇద్దరూ ఇందుకు తగిన దండన అనుభవించకతప్పదు. వచ్చే జన్మలో నీవు అంధుడవై జన్మిస్తావు. అదే సమయంలో సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలోని పరిచారికగా జన్మిస్తుంది. "అని శాపం యిచ్చాడు. ఆ అక్రూరుడే మరు జన్మలో ' సూరదాసు' అనే వైష్ణవభక్తునిగా జన్మించాడు. ఆయనకి బాహ్యదృష్టి లేక పోయినా తన దివ్య దృష్టితో రాధాకృష్ణులను దర్శిస్తూ, ఆనందంతో వారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో పాటలు వ్రాశాడు. కష్టాలెన్ని అనుభవించినా కృష్ణుని మీదనున్న భక్తి,విశ్వాసాలను మార్చుకోలేదు. మరొకచోట జన్మించిన సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలో పరిచారికగా సేవలు చేస్తూ వుండి పోయింది. ఒక నాడు సూరదాసు మహారాజు సూరదాస్ గానాన్ని వినడానికి ఆహ్వానించాడు.సూరదాస్ తన భక్తి కీర్తనలు ఆలపించి అందరిని ఆనందంలో ముంచెత్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రసన్న వదనంతో చక్రధారిగా దర్శనమిచ్చాడు. అంతవరకు గత జన్మలో చేసిన తప్పిదాలకు శిక్ష అనుభవించిన సూరదాసును, రాజుగారి కొలువులో సేవలుచేస్తున్న సత్యభామని కరుణించి తనలో ఐక్యం చేసుకున్నాడు. భగవంతుడు ఎంతటి కరుణా సముద్రుడో అంతటి కఠనాత్ముడు కూడా. స్వపర భేదం లేదు.తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదు. ఈ గుణపాఠాన్ని అందరూ నేర్చుకొని సన్మార్గంలో జీవించవలసినదే.