కరీంనగర్, ఏప్రిల్ 12,
కరీంనగర్ నగరం రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే నగరంలో పలు మార్పులు కనిపిస్తుండగా, తాజాగా ఓ కొత్త ఆలోచన చేశారు. కూరగాయల మార్కెట్ల వద్ద వ్యర్థాలతో ఏర్పడుతున్న అపరిశుభ్రత వాతావరణం, ఇతర కారణాలను పరిగణలోకి తీసుకున్న ఆయన, ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో బయోగ్యాస్, బయోమాన్యూర్ ప్లాంట్స్ ఏర్పాటుకు అడుగులు వేశారు.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్తవేత్తల ఆధ్వర్యంలో కరీంనగరంలో బయోగ్యాస్, బయో మాన్యూర్ ప్లాంట్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడమే కాదు.. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కరీంనగర్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐఐసీటీ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. కూరగాయలు, పండ్లు, పూల వ్యర్థాలను ఒక్కో ప్లాంట్‌లో 10 టన్నుల వరకు వినియోగించి బయోగ్యాస్, బయోమాన్యూర్ ఉత్పత్తి చేయనున్నారు. ఒక్కో ప్లాంట్‌కు వ్యయం ఐదు కోట్లు అవుతుండగా.. స్మార్ట్ సిటీ నిధుల నుంచి వినియోగించనున్నారు.కరీంనగర్ స్మార్ట్ సిటీలో బయోగ్యాస్, బయోమాన్యూర్ ప్లాంట్లను త్వరలోనే నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐసీటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కూరగాయలు, పండ్లు, పూల వ్యర్థాలతో వాతావరణం కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంటుందన్నారు. కరీంనగరంతోపాటు జిల్లాలోని వివిధ మార్కెట్ల నుంచి ఈ వ్యర్థాలను సేకరించి, బయోగ్యాస్, బయోమాన్యూర్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు