YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

సామూహిక పథకాలకు నిధుల కొరత

సామూహిక పథకాలకు నిధుల కొరత

హైదరాబాద్, ఏప్రిల్ 12, 
అందరికీ సార్వజనీన విద్య, ప్రజలందరికీ మెరుగైన పౌష్టికాహారం, ఆరోగ్యం, వైద్యాన్ని అందించటమనేది ప్రభుత్వాల బాధ్యతంటూ మన రాజ్యాంగం చెబుతున్నది. వీటితోపాటు ప్రతీ ఒక్కరికి ఉపాధి, పని కల్పించటమనేది కూడా రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ వీటిలో తెలంగాణ సర్కారు ఎంతో వెనుకబడి ఉన్నట్టు బడ్జెట్‌ గణాంకాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ సర్కారు తొలిసారిగా అధికారంలోకి వచ్చిన 2014లో కేజీ టూ పీజీ ఉచిత విద్యను ఆర్భాటంగా ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా... గవర్నర్‌ ప్రసంగంలో గురుకులాల గురించే ప్రత్యేకంగా ప్రస్తావించారు తప్పితే ప్రభుత్వ పాఠశాలల గురించి ఎక్కడా ఒక్క ముక్క లేకపోవటం గమనార్హం. మరోవైపు 2014 నుంచి 2020 వరకూ పాఠశాల విద్యకు మొత్తం రూ.60,189 కోట్లను కేటాయించగా... అందులో రూ.56,119 కోట్లనే ఖర్చు చేశారు. ఉన్నత విద్యకు రూ.10,524 కోట్లను కేటాయించి... రూ.7,613 కోట్లను మాత్రమే వ్యయం చేశారు. సాంకేతిక విద్యకు రూ.2,642 కోట్లను కేటాయించి...రూ.2,208 కోట్లను ఖర్చు చేశారు. ప్రభుత్వ బడుల నిర్వహణపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో... ఇప్పుడు 'బృహత్తర విద్యా పథకం' అనే పేరిట ఒక కొత్త అంశాన్ని ప్రభుత్వం తెరమీదికి తెచ్చింది. దీని విధి విధానాలు, అమలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.వైద్య, ఆరోగ్యం విషయానికొస్తే... 2014 నుంచి 2020 దాకా ఆ శాఖకు మొత్తం రూ.36,765 కోట్లను కేటాయించి.. రూ.25,498 కోట్లనే ఖర్చు చేయటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం... తెలంగాణ వచ్చాక నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ పథకం కింద చికిత్సలు, శస్త్ర చికిత్సలకు నిరాకరిస్తున్నాయి. ఖమ్మం పట్టణంలో అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడి ఆస్పత్రికే దాదాపు రూ.50 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది. గత మూడేండ్ల నుంచి ఇవి రాకపోవటంతో ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రాణాపాయంలో ఉన్న వారికి ఆపరేషన్లు చేయటానికి మినహా మిగతా వాటికి దాదాపు అమలు కావటం లేదు. ఇక జర్నలిస్టుల ఆరోగ్య పథకా(జేహెచ్‌ఎస్‌)న్ని నిమ్స్‌తోపాటు హైదరాబాద్‌లోని ఒకట్రెండు ఆస్పత్రులు తప్ప రాష్ట్రంలోని మిగతా ఆస్పత్రులు పరిగణనలోకి తీసుకోవటం లేదంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుమారు నాలుగు కోట్ల జనాభా గల మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో కలిపి 23,450 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జనాభాతో పోలిస్తే ఇవి 0.059 శాతమే కావటం గమనార్హం.మరోవైపు హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) పేరుతో స్కైవేలు, హైవేలు, ఫ్లైఓవర్లు, బాహ్య వలయ రహదారుల కోసం వేల కోట్లను ఖర్చు చేస్తున్న సర్కారు... మండల, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను మాత్రం గాలికొదిలేసింది. ఆయా ప్రాంతాల్లో కొత్త రోడ్లను వేయటంగానీ, ఉన్న వాటికి మరమ్మతులు చేయటంగానీ లేకుండా పోయింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఐదేండ్ల నుంచి కొనసాగుతున్న రెండు బ్రిడ్జీల నిర్మాణం... ఇప్పటికీ 'కొనసాగుతూనే' ఉండటం గమనార్హం. అక్కడి కాంట్రాక్టరు ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తి కావటంతో బిల్లులను కావాలనే ఆపేశారనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం ముదివెన్‌ గ్రామంలో 2002లో కూలిపోయిన బ్రిడ్జి పరిస్థితి ఇప్పటికీ అతీగతీ లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి పరిశీలిస్తే... ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణాల్లో 9.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 22.4 శాతం నిరుద్యోగం ఉందని లెక్కలు చెబుతున్నాయి. పీఆర్సీ నివేదిక ప్రకారమే రాష్ట్రంలో 1,91.126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే కోవిడ్‌ సమయంలో తెలంగాణలో 404 పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వేలాది మంది ఉపాధి, పనులు కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. ఇలా ప్రతీ రంగాన్నీ పరిశీలిస్తే.. వ్యక్తిగతంగా లబ్ది చేకూరుస్తున్న పథకాలు, వ్యవస్థాగత స్కీములకు సంబంధించిన అనేకాంశాలు వెలుగు చూస్తున్నాయి. 2014లో మన రాష్ట్రంలో ఫింఛన్‌దారుల సంఖ్య 29,21,982గా ఉంటే.. ఇప్పుడది 39,36,521కు పెరిగింది. అంటే పింఛన్లు తీసుకుంటున్న వారి సంఖ్య పది లక్షలకు పైన్నే పెరిగిందన్నమాట. ఇదే తరహాలో వ్యవస్థాగత అంశాలైన సార్వజనీన విద్య, అందరికీ మెరుగైన, నాణ్యమైన ఉచిత వైద్యం, పౌష్టికాహారం, ఉపాధి, ఉద్యోగాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని సామాజిక విశ్లేషకులు కోరుతున్నారు

Related Posts