జకార్తా ఏప్రిల్ 12
ఇండోనేషియాలోని జావా ద్వీపం తీరంలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైందని జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. ఈ భూకంప ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1,189 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లుమాజాంగ్, మలంగ్, బ్లిటర్, జెంబర్, ట్రెంగ్లక్‌లో భారీగా నష్టం సంభవించింది. హెల్త్ సెంటర్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ధ్వంసమయ్యాయి. నివాసాలు కోల్పోయిన ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్వాసితులందరికీ ఆహారం, న్యూడిల్స్, బ్లాంకెట్స్ తో పాటు ఇతర సామాగ్రిని అందజేశారు.సులవేసి ద్వీపంలోని పలులో 2018లో సంభవించిన భూకంప ధాటికి, ఆ తర్వాత వచ్చిన సునామీ కారణంగా 4,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొందరు గల్లంతు అయ్యారు. నాడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. 2004, డిసెంబర్ 26న సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సునామీ రావడంతో 2,20,000 మంది చనిపోయారు. ఇందులో ఇండోనేషియా ప్రజలు 1,70,000 ఉన్నారు.