ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారని, అయినా ఎలాంటి కాలుష్యం లేకుండా పర్యావరణం చక్కగా, ఆహ్లాదంగా ఉందని పార్లమెంటరీ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ ఛైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. పార్లమెంటరీ కమిటీ తిరుమలలో పర్యటించి పలు ప్రాంతాలను పరిశీలించింది.
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని, చక్కటి పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నారని టీటీడీని కొనియాడారు. శ్రీవారి భక్తులకు ఒక సంవత్సరానికి 96 కోట్లతో అన్నప్రసాద వితరణ జరుగుతోందని కమిటీ చైర్మన్ సుబ్బిరామి రెడ్డి తెలిపారు. సామాన్య భక్తులుండే వసతి గదులను ఆయా కేంద్రాలను పరిశీలించారు. తిరుమలలోని బూందీపోటు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, అక్షయ వంటశాల, పిఏసి-2లోని కల్యాణకట్ట, కాకుల కొండలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్, కాకులకోన తిప్ప, శ్రీగంధం మొక్కల పెంపకాన్ని కమిటీ పరిశీలించింది.