న్యూ ఢిల్లీ ఏప్రిల్ 12
ఇరాన్ లోని నటాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగింది. యురేనియం శుద్దీకరణ కొత్త ప్లాంట్‌ను ప్రారంభించిన మరుసటి రోజే ఆ కేంద్రంపై దాడి జరగడం శోచనీయం. టెహ్రాన్‌లో ఉన్న నటాంజ్ అణు కేంద్రంపై దాడి వల్ల ఆ ప్లాంట్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అయితే ఇజ్రాయిల్ సైబర్ దాడి వల్ల ఆ ఘటన జరిగి ఉంటుందని ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇజ్రాయిల్ మాత్రం దీనిపై ప్రకటన చేయలేదు. ఇటీవల కాలంలో ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాలను ఇజ్రాయిల్ మాత్రం వ్యతిరేకిస్తూనే ఉన్నది. శనివారం రోజున ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ .. నటాంజ్ న్యూక్లియర్ సైట్‌లో కొత్త సెంట్రిప్యూజ్‌లను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని దేశమంతా లైవ్ ఇచ్చారు. సెంట్రిప్యూజ్‌లతోనే శుద్ధీకరించిన యురేనియంను ఉత్పత్తి చేస్తారు. దీంతో అణు ఇంధనం కానీ అణ్వాయుధాలు కానీ తయారీ చేయవచ్చు. నిజానికి ఇరాన్ 2015లో కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్‌ను ఉల్లంఘించింది. శుద్దీకరించిన యురేనియం నిల్వలను కొద్దిగానే ఉంచుకోవాలన్న అంతర్జాతీయ ఒప్పందాలను ఇరాన్ ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం అణు ప్లాంట్‌పై జరిగిన దాడిని.. న్యూక్లియర్ ఉగ్రవాదమని ఇరాన్ ఆరోపించింది.