YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జగన్ బాటలో షర్మిల

జగన్ బాటలో షర్మిల

హైదరాబాద్, ఏప్రిల్ 14,
 తెలంగాణ లో తనకు  రాజకీయ భవిష్యత్ ఉందని బలంగా నమ్ముతోన్న షర్మిల తెలంగాణలో పాగా వేసే ప్రయత్నాలకు పూనుకున్నారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ సమైక్య రాష్ట్రంలో ఓదార్పు యాత్ర  చేసిన షర్మిలకు తెలంగాణలో కొంత మేర పట్టుంది.. తిరిగి ఆ పట్టు నిలబెట్టుకునేందుకు, రాష్ట్రంలో క్రియాశీలం అయ్యేందుకు ట్రయల్స్ ముమ్మరం చేసారు.. ఇందుకోసం తన అన్న జగన్ ఫార్ములాను కాపీ కొడుతున్నారు.  తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠమెక్కి రాజన్న రాజ్యం తీసుకురావాలనే  లక్ష్యంతో ఉన్న వైఎస్ షర్మిల. తన అన్న జగన్ రాజకీయ అడుగుజాడలనే కాపీ కొడుతోంది.. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల జీవితంలో, ఏపీ సీఎం పీఠం దక్కడంతో  దీక్షలు ప్రముఖ పాత్ర పోషించాయి..  సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన లెక్కలేనన్ని దీక్షలు చేశారు. జలదీక్ష, ఫీజు పోరు, హోదా గోదా.. లాంటి పేర్లతో ఆయన తరచూ దీక్షలు చేసేవారు. భారీ హంగామాతో ఆ దీక్షలు సాగేవి. భారీ జనసందోహం కూడా ఆ దీక్షల్లో కనిపించేది.. తాజాగా  తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న షర్మిల ముందుగానే రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా జగనన్న  అడుగుజాడల్లో దీక్షలు చేయబోతున్నారు.  మొదటగా మూడు రోజుల పాటు నిరుద్యోగ సమస్యపై దీక్ష చేయబోతున్నారు.  తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయని ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ షర్మిల ఇందిరాపార్క్ వద్ద పదిహేనో తేదీ నుంచి మూడు రోజుల పాటు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. దీక్షకు అనుమతి ఇవ్వాలని  షర్మిల టీం సెంట్రల్ జోన్ పోలీసు అధికారులను కలిశారు. నేటి  సాయంత్రంలోపు అనుమతిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మరో వైపు దీక్షకు తెలంగాణలోని ఇతరపార్టీల మద్దతు కూడగట్టేందుకు షర్మిల టీం ప్రయత్నిస్తోంది... తెలంగాణ జన సమితి నేత కోదండరాం, గద్దర్, ఆర్. కృష్ణయ్య, తీన్మార్ మల్లన్నలను మద్దతు ఇవ్వాలంటూ ఆహ్వానం పంపారు. షర్మిల దీక్షలకు పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని సమీకరించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి.  అయితే షర్మిల సభకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా  దానిపై సస్పెన్స్ ఉంది. కరోనా కారణంగా సభలు.. సమావేశాలు. .. ధర్నాలకు అనుమతి ఇవ్వడంపై సందేహాలున్నాయి.
చివరగా షర్మిల అంశంలో ఓ విషయాన్ని స్పష్టంగా గమనించాలి.. తెలంగాణ సర్కార్ షర్మిల పార్టీపై వ్యతిరేకత చూపడంలేదు.. ఆమె సభలు.. సమావేశాలకు అభ్యంతర పెట్టడం లేదు. మామూలుగా ఆంధ్రా ముద్ర వేసి రాళ్లు వేసినా ఆశ్చర్యపోని పరిస్థితి ఉండేది.  కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సర్కార్  ఆమె పట్ల  సానుకూలంగా ఉన్నట్టే కనిపిస్తోంది... అందుకే జగనన్న బాటలో సులువుగా దీక్షలు చేయడానికి షర్మిల రంగం సిద్ధం చేసుకుంటోంది

Related Posts