YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రంగంలోకి ఠాగూర్

రంగంలోకి ఠాగూర్

నల్గొండ, ఏప్రిల్ 14, 
నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక క్లైమాక్స్ కు చేరుకుంది. రెండు రోజుల్లో ప్ర‌చార ప‌ర్వం ముగియ‌నుండ‌టంతో.. కాంగ్రెస్ మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. మొద‌ట్లో జానారెడ్డి ఒక్క‌రికే వ‌దిలేసిన కాంగ్రెస్ పార్టీ.. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి రూటు మార్చింది. ఇప్ప‌టికే రాష్ట్ర ముఖ్య‌నేత‌లంద‌రూ సాగ‌ర్‌లో ప్ర‌చారం చేప‌ట్ట‌గా.. ఆఖ‌రికి రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా రంగంలోకి దిగుతున్నారు . సాగ‌ర్‌లో ప్ర‌చారం చేసేందుకు ఠాగూర్ రెడీ అయ్యారు..
నాగార్జున‌సాగ‌ర్ పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూల‌మైన ప్రాంతం. పార్టీ సీనియ‌ర్ నేత జానారెడ్డి స్వంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం... వ‌రుస‌గా ప‌లుమార్లు గెలిచిన చ‌రిత్ర ఉండ‌టంతో కాంగ్రెస్‌కు కాస్త ప‌ట్టుంది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మెజార్టీతో ఓడిపోయిన.. జానారెడ్డి ఈ సారి అనుకోకుండా వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా గెలిచి తీరుతాన‌ని భావించారు. అందుకు అనుగుణంగానే మొద‌ట్లో.. ప్ర‌చార విష‌యంలో కూడా జానారెడ్డి తాను ఒక్క‌డినే చూసుకుంటాన‌ని పార్టీ పెద్ద‌ల‌కు న‌చ్చ‌జెప్పారు. కానీ గ్రౌండ్‌లో వాస్త‌వ ప‌రిస్థితి రోజు రోజుకు సంక్లిష్టంగా మారుతోంది. దీంతో జానారెడ్డి అప్ర‌మ‌త్త‌మై.. పార్టీ శ్రేణుల‌ను వ‌రుస పెట్టి రంగంలోకి దించుతున్నారు...
సాగ‌ర్‌లో జానారెడ్డి త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డం కోసం సీనియ‌ర్ల‌ను మండ‌లాల వారీగా ఇంచార్జ్‌లుగా నియ‌మించింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఏడు మండ‌లాలు, రెండు మున్సిపాలిటీల‌కు సీనియ‌ర్ నేత‌ల‌ను ఇంచార్జ్‌లుగా వేశారు. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌, ఎంపీలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క, సీనియ‌ర్‌నేత‌లు ష‌బ్బీర్ ఆలీ, పొన్నం ప్ర‌భాక‌ర్‌, జీవ‌న్‌రెడ్డి త‌దిత‌ర నేత‌లంద‌రూ సాగ‌ర్‌లో మ‌కాం వేశారు. ఆయా నేత‌ల‌కు స‌పోర్టుగా ఉండేందుకు మిగ‌తా నేత‌ల‌ను కూడా రంగంలోకి దింపింది. ఇలా మొత్తం మీద గ‌త నాలుగైదు రోజులుగా సాగ‌ర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌చారాన్ని ఉర్రూత‌లూగిస్తోంది.
సాగ‌ర్‌లో టీ.ఆర్‌.ఎస్ అభ్య‌ర్థి త‌ర‌పున సీఎం కేసీఆర్‌, బీజేపీ త‌ర‌పున ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ త‌రుణ్ చుగ్‌లు ప‌ర్య‌ట‌న‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అప్ర‌మ‌త్త‌మైంది. కాంగ్రెస్ త‌ర‌పున ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు. త‌న స్వంత రాష్ట్రం త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ.. సాగ‌ర్‌లో జానారెడ్డి త‌ర‌పున ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించారు. హైద‌రాబాద్ చేరుకుంటున్న మాణిక్కం ఠాగూర్‌... అందుబాటులో ఉన్న నేత‌ల‌తో గాంధీభ‌వ‌న్‌లో స‌మావేశం కానున్నారు. ఆ త‌ర్వాత  నాగార్జున‌సాగ‌ర్ వెళ్లి పార్టీ అభ్యర్థి జానారెడ్డి త‌ర‌పున ప్ర‌చారం చేయ‌నున్నారు మాణిక్కం ఠాగూర్‌.

Related Posts