హనుమ గాల్లో వున్నారు. ఎగురుతున్నారు. వెనక లంకలో అప్రతిహతమైన కార్యం ముగించుకొస్తున్నారు. అది నభూతో నభవిష్యతి. అన్యులెవరికీ అది సాధ్యపడదు. అజేయమైన లంకారాజ్యాన్ని , అపరశివభక్తుడైన రావణబ్రహ్మ అహంకారాన్ని కాల్చి బుగ్గి చేసి వస్తున్నారు. తోక కాలి వుంది. గాలి చల్లగా వీస్తోంది. శరీరం తేలిగ్గా వుంది. మనస్సింకా తేలిగ్గా వుంది. అదెప్పుడో రామచంద్రుడి దగ్గర వాలిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది మనస్సు. తానిప్పుడు వెళ్ళి సీతమ్మ జాడ చెప్పాలంతే. వెళ్ళేప్పుడు వున్న భారమిప్పుడు లేదు. అప్పటి దిగులు ఇంకా లేదు. తోకలోంచి పరాగము సముద్రంపై రాలుతోంది. క్రిందన నీటిలో అమితవేగంతో పరుగెడుతున్న హనుమ నీడను పట్టుకోవటానికి తిమింగలాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. మనకి వినపడటం లేదు గానీ, అవి పలు కారణాలకు ఆయనకు జేజేలు పలుకుతున్నాయి. కాస్త క్రిందను తక్కువ ఎత్తులో ఎగిరితే నీటి తుంపర పుడుతోంది. వడివడిగా వెళ్ళాలి. వడివడిగా వెళ్ళాలి. స్వామికార్యం పూర్తి చేయాలి. సుగ్రీవుడు పెట్టిన రెండు నెలల గడువూ, దక్షిణ దిక్కుకు వచ్చినవానరులకి తానిచ్చిన గడువూ పూర్తవుతున్నాయి. తాను దక్షిణ దిక్కుకు వెళ్ళకపోతే ఆ వానర ప్రముఖ భాగమంతా ప్రాయోపవేశం చేయటానికి తోకలు పైకెత్తి పట్టుకు నిలుచున్నాయి ఆత్రం తో. ఆయన వేగానికి కురులలోంచి గాలి గిరికీలుకొట్టి ఛస్సుమని చప్పుడు చేస్తూ వుంది. దృష్టి తీక్ష్ణంగా సూటిగా వుంది. ఆలోచన పరుగున వుంది. కార్యసాధన భారం దిగినందుకో ఏమో, మహోత్సాహంగా వుంది. అపరబలశాలి,బహు పరాక్రమశాలి, అమిత వినయసంపన్నుడు, స్వామి కార్య దక్షుడు, కాల్చబడిన వాలము కలవాడు, సీతమ్మ చెప్పిన కాకాసుర వృత్తాంతము వారిరువురికు తక్క అన్యులకు తెలియని విషయం తనకు తెలిసిన వాడు, అన్నిటికూ మించి సీతమ్మ దుఃఖమును తీర్చిన స్వామి బంటు, మొదటి సారి సీతమ్మ పుత్రవాత్సల్యం పొందిన అయోధ్యేతరుడు, హనుమ. యోగవిద్యద్వారా ఎగరటం వల్ల శరీరం బిగుసుకుపోయి వుంది. బలమైన ఊపిరులు తీస్తున్నాడు. భృకుటి ముడివడింది. సమయానికి చేరకపోతే వానరసైన్యం అమంగళం పాలవుతుంది. ఎందుకో ప్రకృతి ప్రశాంతంగా కనిపించింది. ఆనాడు సూర్యోదయానికి లేని ఆనందం ప్రకృతికి సీత చిరునవ్వులో హనుమ వల్ల దొరికింది।
దూరంగా వానరసైన్యం కితకిచలు. బద్దలైపోయి వున్న మహేంద్రగిరి తిరిగి స్వాగతం చెప్పటానికా అన్నట్టునేలమట్టమయిన తన ఆకారాన్ని హనుమకు దిగటానికి గుర్తుగా చూపిస్తోంది. అంగదాది వానరులు క్షణాలు లెక్కపెట్టుకుంటున్నారు. ఎవరికిన్నీ హనుమ తిరిగి వస్తారని నమ్మకం లేదు. వెనక్కి వెళితే సుగ్రీవులవారు నరికేస్తారు. ముందు సముద్రం తప్ప మార్గం లేదు. అంతలో దూరంగా సూర్యునికి అడ్డంగా తమను కమ్మివేస్తూ కారుమేఘంలా హనుమ కనపడ్డారు. కోతులు పెద్దగా కిచకిచలు మొదలెట్టాయి. అసలు కొన్నయితే ఆయన వచ్చి చెప్పబోయే దుర్వార్త (అనుకుని) వినటం కూడా ఇష్టం లేక సముద్రం లోకి దూకబోయాయి. హనుమపై నమ్మకం వున్న వానరాలు, ప్రముఖ వానరాలు ఆశగా పైకి చూస్తున్నాయి. వెరసి అన్ని వానరాల్లో ఆశ్చర్యం ఆశ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అందరి కళ్ళూ జిగేలు మని మెరుస్తున్నాయి. అందరూ అమితాశ్చర్యంతో, హనుమను చూసిన ఆనందంతో కళ్ళ నీళ్ళు, ఏడుపు, కొన్ని వానరాలు ఎగురుతున్నాయి. కొన్ని అరుస్తున్నాయి. కొన్ని జయదయధ్వానం చేస్తున్నాయి. ముఖ్యంగా నాయకుడు అంగదుడికి గొంతు తడారిపోయింది. ఏమంటాడో అని. జాంబవంతుని వంక చూసాడు. ఆయనా అంగదుడుకి భరోసా ఇవ్వటానికిని తల పంకించారు. ఏం కాదు, అంతా మంచే జరుగునన్నట్టుగా।
అన్ని వానరాలలోనూ ఆశ, బతుకు, భవిత, ఆనందం, స్వామి రాముని జీవితం , తండ్రి సుగ్రీవుని మాట, అన్నీ ఆదిగబోతున్న వానరోత్తముడిపై వున్నాయి. అంతా కోలాహలంగా వుంది. హోరు హోరు మని హే ల హేల గా అరుస్తున్నారు వానరులు. ఆయనా పైనుంచి చూసితూదిగుతూ వున్నారు। మహేంద్రగిరి కనపడుతోంది. ఈ వానరాలు క్రింద చేసే కోలాహలం లో ఆయన చెప్పేది కింద వారికి వినపడుద్దో లేదో అన్న భావనతోనూ, ఆయన దిగేంత వరకూ వుండలేని వానర బుద్ధి ఎరిగి నిరాశావాదులైన వానరాలను అదిలించటానికిన్నూ తాను సాధించిన స్వామికార్యానికి గర్వంగాను, మహా ఉత్సాహంతోను, ఆనందంతోనూ, పరమానందంతోనూ, మళ్ళీ “సీతా” అన్నాక లంకలో వుందంటాడో లంకలో లేదంటాడో అన్న చిన్న సంశయాన్ని కూడా తోకలు ఎత్తి పరమ ఆత్రం తో ముని వేళ్ళపై నిలుచున్న వానరాలకు రానివ్వకుండా వాటి సంగతి తెలుసు గనుక, వాక్శుద్ధి కలిగిన స్వామి, నవవ్యాకరణ పండితుడయిన నా స్వామి హనుమ అంతవరకూ తలముందుకూ కాళ్ళూ తోకా వెనగ్గా ఎగురుతున్న స్వామి హనుమ, దిగటానికి సమాయత్తమవుతూ కాళ్ళు కిందకి పెట్టి చేతులను బార చాపి వాలము పైకెత్తి కిందకు చూస్తూ, గాట్ఠిగా ఊపిరి తీసి “*దృష్ట్వా సీతా*” అన్నాడు. అంటే, “*చూడబడెను సీతమ్మ*!” అని . ఇంక దిగాక గోలలో సీతమ్మ అనే పదం వారికి వినపడినా సరిగా వినపడకపోయినా, “చూడబడెను” అనేన పదం అక్కడికి చాలు వారికి. అమిత సమయస్ఫూర్తిపరులు , కార్యసాధకులు, ధృఢచిత్తం కలవారు, స్వామి హనుమ.