తెలంగాణ రాష్ట్ర సమితి 17వ వార్షికోత్సవం ఘనంగా ప్రారంభమయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నినియోజకవర్గాల నుంచి పార్టీ ప్రతినిధులు హజరయ్యారు. ముందుగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడారు. వ్యవసాయ విధానంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. స్వరాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకుని జీవిస్తున్నామని మాజీ మంత్రి బస్వరాజు పేర్కొన్నారు అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు, పథకాలేకారణమని అన్నారు. వ్యవసాయ విధానంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని, దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మన నాయకుడికి వెన్నంటి ఉండాల్సిన అవసరం ఉందని బస్వరాజు సారయ్య అన్నారు.
రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మాట్లడుతూ తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ దేశ గతిని మార్చే ఒక ప్రత్యామ్నాయం అని అన్నారు. ప్లీనరీలో దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం ఉద్యమ తీర్మానాన్ని అయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ నెంబర్ వన్ అయ్యిందంటే అది కేసీఆర్ ఘనతే అని అన్నారు రాష్ట్రాలపై కేంద్రం పెత్తనానికి చెక్ పెట్టేందుకు ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేంద్రం ఏకపక్ష వైఖరి వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కేకే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలకు కొత్త నిర్వచనం ఈ ఫెడరల్ ఫ్రంట్ అని కేకే చెప్పారు. దేశంలో గుణాత్మక మార్పును తీసుకువచ్చేందుకు నడుం కట్టిన నేత కేసీఆర్ అని కేకే అన్నారు. గత ప్రభుత్వాల హయాల్లో జరగని అభివృద్ధి.. ఈ నాలుగేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని 70 ఏళ్లలో ఎందుకు సాధించుకోలేకపోయామని ఆలోచించుకోవాలి. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు కేకే. నీటి పారుదల రంగంపై సీఎం కేసీఆర్కు సమగ్ర అవగాహన ఉందన్నారు.