విశాఖపట్టణం, ఏప్రిల్ 15,
రాష్ట్ర విభజన తర్వాత వైజాగ్ జెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ సిటీ జాబితాలో విశాఖను చేర్చారు. వేలాది కోట్లతో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని పాలకులు ప్రకటించారు.అయితే.. పాలకులు ఊదరగొట్టిన అభివృద్ధి ఏదీ నగరంలో కనిపించడం లేదు. స్లమ్స్ లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 632 వందల చదరపు కిలోమీటర్లు ఉన్న విశాఖ నగరంలో కేవలం 0.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మాత్రమే స్మార్ట్ సిటీగా ప్రకటించారు. మరో వైపు సీటి విస్తీర్ణం పెరగడంతో... అదే లెవల్ లో స్లమ్స్ పెరుగుతున్నాయి.మురికివాడల సంఖ్యను తగ్గించేందుకు వందల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పుతున్నప్పటికీ.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలో 2013లో నగరంలో 741 ఉన్న స్లమ్స్ ఉండగా.. అవి 790కి పెరిగాయని ప్రకటించింది. అదేవిధంగా మురికివాడల్లో ఉండే జనాభా సంఖ్య 352 శాతం పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే విశాఖ నగరం ముంబయి తరహాలో మురికివాడల నగరంగా మారే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.ఇక మురికివాడల నిర్మూలనకు జీవీఎంసీ బడ్జెట్‌లో 40 శాతం నిధులు కేటాయించాలని నిబంధన ఉన్నప్పటికీ పాలకులు అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో క్రమక్రమంగా స్లమ్స్ పెరిగిపోతున్నాయి. అయితే.. నగరంలో మురికివాడలను నిర్మూలించకుండా స్మార్ట్‌సిటీ ఎలా చేస్తారని స్వచ్చందసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ సిటీ పేరుతో పేదలను స్లమ్స్ నుంచి ఖాళీ చేయించి విలువైన భూములు కొట్టేయ్యడానికి ప్రయత్నిస్తుందని విమర్శిస్తున్నారు. ఇదిలావుంటే.. అధికారుల వాదన మరోలా ఉంది. 2022లోగా మురికివాడలన్నీ నిర్మూలించి పేదలకు ఇళ్లు కట్టిస్తామంటున్నారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తామంటూ గొప్పలు చెబుతున్న పాలకులు.. మురికి వాడల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.