సిద్దు... సిద్ధార్థ్ రాయ్... అంటూ వెండి తెరపై పవన్ కళ్యాణ్ గారు చేసి 'ఖుషి'కి నేటితో పదిహేడేళ్లు నిండాయి. 2001 ఏప్రిల్ 27 న విడుదలైన 'ఖుషి' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యువతరం ప్రేమ కథలకు, స్టైల్స్ కు ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హుషారైన నటన, ఫైట్స్ నాటి యువతనే కాదు పెద్దవాళ్ళనీ మెప్పించాయి. శుక్రవారం నాటికి ఈ ఖుషి చిత్రం విడుదలై పదిహేడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత శ్రీ ఎ.ఎం.రత్నం, పవన్ కళ్యాణ్ ని జనసేన కార్యాలయంలో కలిశారు. భారీ పుష్పగుచ్ఛం అందించి సంతోషాన్ని పంచుకున్నారు. ఖుషి చిత్ర అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించారు. భూమిక కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. 'అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా...', 'చెలియ చెలియ..', 'యే మేరా జహా...' లాంటి గీతాలు ప్రాచుర్యం పొందాయి. 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే...' అనే అలనాటి గీతం రీమిక్స్ వెర్షన్ అప్పట్లో చర్చనీయం అయింది .