ఖమ్మంలో... పెరుగుతున్న కేసులు
ఖమ్మం, ఏప్రిల్ 15,
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గత వారం పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.జిల్లాలో 304 శాంపిళ్లను హైదరాబాద్‌కు పంపించగా 202 టెస్టులు నెగెటీవ్ వచ్చాయి. మరో 97 కేసులకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. విదేశాల నుంచి వచ్చిన 585 మందిని హోం క్వారెంటైన్‌లో ఉంచారు. శారద కళాశాలోని ప్రత్యేక క్వారంటైన్‌లో 25 మంది, వైటీసీలో మరో 8 మందిని ఉంచారు. పెద్దాస్పత్రిలోని కరోనా వార్డులో ఇంత వరకు 1,192 మందికి ఓపీ, 325 మందికి ఇన్‌పేషెంట్ సేవలు అందించారు. అధికారులు అతడితో కాంటాక్ట్ అయిన వారి ఆచూకీ తెలుసుకుని 50 మందికి పైగా వ్యక్తులను పరీక్షల కోసం ఐసోలేషన్ తరలించారు. స్వాబ్ శాంపిళ్లు సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించగా వైద్య పరీక్షల్లో మోతీ నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈనెల 13వ తేదీన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు రోజుల కిందట ఖమ్మం ఖిల్లా బజార్‌లో ఒకరికి పాజిటివ్ రాగా..శనివారం అతడి కుటుంబంలోని మరో మహిళకు కూడా సోకినట్లు తేలింది. తాజాగా ఆమె తొమ్మిదేళ్ల కూతురికి కూడా కరోనా ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు.దీంతో జిల్లాలో కరోనా రోగుల సంఖ్య ఐదుకు చేరుకుంది. క్రమంగా సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లాక్‌డౌన్ నిబంధనలను ఇంకా కఠినతరం చేశారు. మోతీ నగర్, ఖిల్లా, పెద్దతండా ప్రాంతాల్లో ఇంటింటినీ జల్లెడ పడుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తుల ఫోన్‌కాల్స్ ఆధారంగా ఎవరెవరిని కలిశారు అనే అంశంపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఏయే ప్రాంతాలకు వెళ్లారు? ఇతరులను కలిశారా? వారెంత మంది? వంటి విషయాలను కూపీ లాగుతున్నారు. అయితే ఖిల్లా ప్రాంతం వ్యక్తికి ఎలా పాజిటివ్ వచ్చిందనే విషయం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఇంకా అంతుచిక్కట్లేదు. ఖమ్మంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని కరోనా వార్డుకు మంగళవారం ఒక్కరోజే 100కుపైగా అనుమానిత కేసులు వచ్చాయి. డాక్టర్లు వారిని పరీక్షించి లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్ వార్డుకు పంపారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. స్వాబ్ టెస్టులో నెగెటీవ్ వచ్చినా వారిని ఇంటికి పంపించకుండా శారద కళాశాలలో కానీ, మద్దులపల్లి వైటీసీ ప్రత్యేక క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో తొలుత నెగెటివ్ వచ్చి, కొన్ని రోజలకు పాజిటీవ్ వచ్చిన సంఘటనలు ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలను కఠినంగా అమలు చేస్తున్నారు.