న్యూఢిల్లీ ఏప్రిల్ 15
ఇండియా, పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు గత జనవరిలో దుబాయ్‌లో రహస్యంగా చర్చలు జరిపినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌టర్స్ వెల్లడించింది. కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చడానికి వీళ్లు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇండియాకు చెందిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) సభ్యులు, పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెంట్లు యూఏఈ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించిన చర్చల్లో పాల్గొన్నట్లు రాయ్‌టర్స్ చెప్పింది. అయితే ఈ వార్తలపై ఇటు భారత విదేశాంగ శాఖగానీ, అటు పాకిస్థాన్ ఐఎస్ఐగానీ స్పందించలేదు.అయితే పాకిస్థాన్‌కు చెందిన రక్షణ శాఖ నిపుణురాలు అయేషా సిద్ధిఖీ మాత్రం ఈ చర్చలు నిజమేనని చెప్పడం గమనార్హం. రెండు దేశాల ఇంటెలిజెన్స్ అధికారులు కొన్ని నెలలుగా సమావేశమవుతూనే ఉన్నారని ఆమె చెప్పారు. దుబాయ్‌లోనే కాదు థాయ్‌లాండ్, లండన్‌లలోనూ ఈ సమావేశాలు జరిగినట్లు తెలిపారు. అయితే వీటి వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అయేషా అనడం గమనార్హం. అందుకే రెండు దేశాలూ ఈ చర్చల విషయాన్ని బయటకు వెల్లడించకుండా సీక్రెట్‌గా ఉంచుతున్నాయని రాయ్‌టర్స్ రిపోర్ట్ తెలిపింది.అయితే రెండు దేశాలు ఇలా సడెన్‌గా రహస్య చర్చలకు వెళ్లడానికి ఓ బలమైన కారణమే కనిపిస్తోంది. ఇండియాకు ఓవైపు చైనాతో సరిహద్దులో తలనొప్పులు ఉన్నాయి. అటు పాకిస్థాన్ ఆర్థికపరమైన సంక్షోభంలో కూరుకుపోయింది. పైగా పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘనిస్థాన్‌తో సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలూ కశ్మీర్ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కోసం చూస్తున్నాయి.అందుకే రెండు దేశాలు చర్చలు మొదలుపెట్టడమే సరైనదని, అది కూడా పబ్లిగ్గా చేయడం కంటే ఇలా రహస్యంగా చేయడం మంచిదని రాయ్‌టర్స్ మాజీ జర్నలిస్ట్ మైరా మెక్‌డొనాల్డ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ చర్చలు ఇప్పటి ఉద్రిక్తతలను తగ్గించడానికే తప్ప కశ్మీర్‌పై శాశ్వత పరిష్కారం కోసం మాత్రం కాదని మైరా అన్నారు. 2019లో పుల్వామా దాడి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే.