YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

వేరు సెనగకు మంచి డిమాండ్

వేరు సెనగకు మంచి డిమాండ్

అనంతపురం, ఏప్రిల్ 16,
రానున్న ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ చేసే సబ్సిడీ వేరుశనగ విత్తనాల సేకరణ విషయమై ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం, వ్యవసాయానికి సంబంధించి సచివాలయ స్థాయిలో నిర్ణయాలు చేసే కొంత మంది విత్తనాలను కాంట్రాక్టర్ల ద్వారా సేకరించాలని యోచిస్తుండగా, వ్యవసాయశాఖ పాలనా విభాగమైన కమిషనరేట్‌, కింది స్థాయి అధికారులు మాత్రం రైతుల నుండి నేరుగా సేకరించాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇరు పక్షాలూ తమ 'ప్రయోజనాల' కోసం తాము చెప్పిందే జరగాలంటున్నారని ఆరోపణలస్తున్నాయి. దాంతో విత్తనాల సేకరణ కుంటుపడింది. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న దళారులు, వ్యాపారులు వేరుశనగ పంటను బ్లాక్‌ చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన రబీ పంటను రాయలసీమలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నిల్వ చేస్తున్నారు. ఈ పరిణామాలతో సబ్సిడీ వేరుశనగ విత్తనాల విక్రయ ధర (సేల్‌ ప్రైస్‌) భారీగా పెరిగే అవకాశముంది. సేకరణ, ప్రాసెసింగ్‌, హ్యాండ్లింగ్‌, రవాణ అన్ని ఖర్చులూ కలుపుకొని నిరుడు ఎపి సీడ్స్‌ క్వింటాలు సేల్‌ ప్రైస్‌ రూ.7,850గా నిర్ణయించగా, ఈ ఏట రూ.9 వేలకు కొంచెం అటూ ఇటుగా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వంపై అదనపు సబ్సిడీ భారం, రైతులు సబ్సిడీపోను చెల్లించే సొమ్ము భాగం బాగా పెరగనుంది. సర్కారు సబ్సిడీ పరిమాణాన్ని, లేక రైతులకు పంపిణీ చేసే విత్తనాల పరిమాణాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.ఏప్రిల్‌ 20 కల్లా ప్రాసెస్‌ చేయని విత్తనాలను సేకరించాలని, నెలాఖరుకల్లా ప్రాసెస్‌ పూర్తి చేయాలని, మే మొదటి, రెండు వారాల్లో బ్యాగింగ్‌ పూర్తి చేసి, 15 కల్లా రైతు భరోసా కేంద్రాలకు చేర్చాలని, అనంతరం రైతులకు పంపిణీ ప్రారంభించాలని వ్యవసాయశాఖ కమిషనరేట్‌ షెడ్యూల్‌ రూపొందించింది. ఎపి సీడ్స్‌కు క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రైతుల నుంచి విత్తనాల సేకరణ బాధ్యత వ్యవసాయశాఖ సిబ్బందిపై పడింది. వారికి ఎన్నికల డ్యూటీలు పడటంతో సేకరణకు కొంత అంతరాయం ఏర్పడింది. కాగా విత్తనాల సేకరణ వ్యవసాయశాఖ చేపట్టగా, డబ్బులు ఇచ్చేది ఎపి సీడ్స్‌్‌ కావడం వలన రైతులకు అగ్రికల్చర్‌ సిబ్బంది సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. అందుకే ఏప్రిల్‌ రెండోవారంలోనూ సేకరణ ఊపందుకోలేదు. అన్‌ప్రాసెస్డ్‌ సీడ్‌ 4.91 లక్షల క్వింటాళ్లు సేకరించాలన్నది టార్గెట్‌ కాగా ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లు సేకరించారు. వేసుకున్న షెడ్యూల్‌ లోపు సేకరణ పూర్తి కావాలంటే రోజుకు 20 వేల క్వింటాళ్లు సేకరించాలని డిపార్టుమెంట్‌ అంచనా వేసింది. ప్రాసెస్‌ చేసిన విత్తనం 4.46 లక్షల క్వింటాళ్లు సేకరించాలనుకోగా ఇప్పటికి 25 వేల క్వింటాళ్లు సేకరించారు. అనుకున్న సమయానికి సేకరణ పూర్తి కావాలంటే రోజుకు 17 వేల క్వింటాళ్లు ప్రాసెస్‌ చేయాలి. ప్రాసెస్‌ చేసిన విత్తనం ఇప్పటికి ఏడు శాతం లోపే సేకరణ జరిగింది. చివరి నిమిషంలో రైతులకు అదనుకు విత్తనాలు ఇవ్వాలన్న పేరిట కాంట్రాక్టర్ల నుండి అధిక ధరపై సేకరించేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) రూ.5,275 కాగా, దళారులు, వ్యాపారులు రైతుల నుండి ఒక రూపాయి ఎక్కువ పెట్టి కొనేసి నిల్వ పెట్టుకున్నారు. ఎపి సీడ్స్‌ సర్టిఫైడ్‌ సీడ్‌ రూ.6,500, ట్రూత్‌ఫుల్‌ సీడ్‌ 6,400గా ధర నిర్ణయించినప్పటికీ సేకరణ సరిగ్గా చేపట్టలేదు. ఎపి సీడ్స్‌ సొమ్ము బ్యాంక్‌ అకౌంట్‌లో పడేసరికి రెండు నెలలు ఆలస్యమవుతుందని, అదే వ్యాపారులైతే వెంటనే డబ్బులిస్తారని రైతులు వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు. సేకరణలో డిపార్టుమెంట్‌ వైఫల్యం చెందాక, చివరి నిమిషంలో హడావిడిగా టెండర్లు పిలవడం అనివార్యం. అందుకోసమే కాచుక్కూర్చున్న వ్యాపారులు ధరలను అమాంతం పెంచడం ఖాయం.

Related Posts