హైద్రాబాద్, ఏప్రిల్ 16,
పాత బస్తీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కరంగా పెరుగుతోంది. ఓల్డ్ సిటీ మరింత రిస్క్ జోన్‌లోకి వెళ్తోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండటం, ఢిల్లీకి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 592 కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లో 267 కేసులు నిర్థారణైయ్యాయి. కేవలం పాతబస్తీ నుంచే 57 కేసులు నమోదయ్యాయి. పాతబస్తీలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రభావం ప్రారంభంలో తక్కువగా ఉన్నా ఢిల్లీ మత ప్రార్థనల తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. ఈ జమాత్ అనుబంధ సంస్థగా మల్లేపల్లిలోని బడీ మసీద్‌ను వ్యవహరిస్తారు. విదేశస్తులు కూడా సందర్శన కోసం ఢిల్లీ తర్వాత ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడే బస చేసి మత ప్రచారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అందుకే ఈ ఏరియాలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పకపోవడం వల్ల కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించింది. వారి నుంచి సెకండ్ కాంటాక్ట్‌లో ఉన్న వారి సంఖ్య మరింత పెరిగింది. బాబానగర్, యాకుత్‌పురా, సాగంజ్, నూర్‌ఖాన్ బజార్, సైదాబాద్, చంద్రాయణగుట్ట, మలక్‌పేట, టోలీచౌకి ఇలా అనేక ప్రాంతాలు ఇప్పుడు హాట్ స్పాట్లు అయ్యాయి. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిని కలిసిన వారు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం లేకపోలేదు. వీరందరినీ పట్టుకోవడం అధికారులకు ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. ఈ విషయమై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. 67 ఏండ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎలా సోకిందో ఇంకా తెలియ రాలేదు. ఈ వృద్ధురాలికి ట్రావెల్ హిస్టరీ లేదు.. పాజిటివ్ వచ్చిన వారితో సంబంధాలూ లేవు. అయినా పాజిటివ్ ఎలా వచ్చింది అనే విషయాన్ని అధికారులు లోతుగా విచారిస్తున్నారు. వృద్ధురాలి ద్వారా ఆమె మూడేండ్ల మనువడికి కూడా వైరస్ సోకింది. ఇద్దరూ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్క రోజే హైదరాబాద్ పరిధిలో 45 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాతబస్తీలోని అమర్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాజిటివ్ వచ్చింది. ఇదే కుటుంబానికి చెందిన మహిళ కరోనాతో రెండు రోజుల క్రితం మృతి చెందింది. ఆమె ద్వారా కుటుంబం మొత్తానికి వైరస్ సోకినట్టుగా అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ కుటుంబంలో ఎవ్వరికీ మర్కజ్ ట్రావెల్ హిస్టరీ లేదు. అయినా వైరస్ ఎలా వ్యాపించిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలోనే హైదరాబాద్‌లో ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 45 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. హైద రాబాద్‌లో కేసుల సంఖ్య క్రమేణా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 10 కేసులు నమోదు కాగా, మంగళవారం ఒక్కరోజే ఏకంగా 35 కేసులు నమోద య్యాయి.