న్యూ ఢిల్లీ ఏప్రిల్ 16
అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన జరిగింది. ఇండియానాపోలిస్లో ఉన్న ఎయిర్పోర్ట్ వద్ద ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఫెడెక్స్ కార్గో డెలివరీ సంస్థ ఆఫీసు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. సబ్మెషీన్ గన్తో ఓ ఉన్మాది భీకరంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డవారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత ఆ షూటర్ పరారీలో ఉన్నట్లు తెలిసినా.. అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఎందుకు ఆ సాయుధుడు కాల్పులకు తెగించాడో ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. ఈ కాల్పుల ఘటన పట్ల దర్యాప్తు కొనసాగుతున్నది.రాత్రి 11 గంటల సమయంలో కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. ఎయిర్పోర్ట్ సమీపం వద్ద ఘటన చోటుచేసుకున్నా.. విమానాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు చెప్పారు. కాల్పుల ఘటనపై ఫెడెక్స్ కొరియర్ సంస్థ ప్రకటన జారీ చేసింది. అధికారులకు సహకరిస్తున్నట్లు చెప్పింది. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపింది.