YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి తెలంగాణ

ప్రీ ప్రైమరీ టీచర్లకు, స్కూల్ బస్ డ్రైవర్లకు, ఆయాలకు కూడా ప్రభుత్వ సహాయం అందజేయాలి - ముఖ్యమంత్రి కెసిఆర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి

ప్రీ ప్రైమరీ టీచర్లకు, స్కూల్ బస్ డ్రైవర్లకు, ఆయాలకు కూడా ప్రభుత్వ సహాయం అందజేయాలి - ముఖ్యమంత్రి కెసిఆర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి

ముఖ్యమంత్రి కెసిఆర్ కు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి - కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం  ప్రీ ప్రైమరీ టీచర్లకు, స్కూల్ బస్ డ్రైవర్లకు, ఆయాలకు కూడా అందజేయాలని "ప్రభుత్వామోదిత పాఠశాలల పరిరక్షణ సమితి" కన్వీనర్ చుక్క గంగారెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి జిమెయిల్, వాట్సాప్ ల ద్వారా ఒక విజ్ఞాపన పత్రం పంపిస్తూ దాని ప్రతిని జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా అందజేశారు. ఈ సందర్భంగా "రికగ్నైజుడ్ స్కూల్స్ ప్రొటక్షన్ సొసైటీ" కన్వీనర్ చుక్క గంగారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన నిరులేదలకు అందని ద్రాక్ష  కాకూడదన్నారు.


కరోనా వైరస్ కారణంగా ప్రైవేట్ పాఠశాలలు, విద్యా సంస్థలు మూతబడి లక్షలాది మంది టీచర్లు, బోధన, బోధనేతర సిబ్బంది ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా  ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు రూ.2000 చొప్పున ఆర్థిక సహాయం,
 25కిలోల బియ్యం అందజేస్తున్నందులకు ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం ప్రైవేట్ టీచర్ల జీవన కొనసాగింపుకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం వారికి కొండంత అండగా నిలుస్తోందన్నారు.
కానీ... అత్యంత నిరుపేదలైన ప్రీ ప్రైమరీ (పూర్వ ప్రాథమిక) టీచర్లకు, స్కూల్ బస్ డ్రైవర్లకు, ఆయాలకు, ఇతరత్రా సిబ్బందికి, ప్రైవేట్ కాలేజీలలో పని చేసే వారికి  ఈ సహాయం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయానికి ప్రీ ప్రైమరీ టీచర్లను, స్కూల్ బస్ డ్రైవర్లను, కన్న తల్లిలా పిల్లల ఆలనా పాలనా చూసే ఆయాలను ఈ పథకానికి అధికారులు అనర్హులుగా  ప్రకటిస్తున్నారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అతి కష్టమైన పనితో, చాలా రిస్కుతో కూడుకొని, చాలా ఓపిక, నేర్పుతో,  అత్యధిక మెరుగైన సేవలు అందిస్తున్నది ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలు, బస్ డ్రైవర్లు అని ఆయన సూచించారు.  అంతే కాకుండా వీళ్ళంతా నిజంగా నిరుపేదలని, వీరంతా పూర్తిగా అట్టడుగు వర్గాలకు చెందిన వారని ఆయన అన్నారు.


 దాదాపు ప్రతి పాఠశాలలో 15 నుండి 40శాతం మంది ఈ కోవకు చెందినవారే నన్నారు. కొద్దిపాటి చాలీ చాలని జీతాలకు పని చేస్తూ వారి కుటుంబాలను పోషించు కుంటున్నారని తెలిపారు.


కరోనా వలన ఉపాది కోల్పోయి ఇప్పటికే  అనేక సమస్యలతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ నిజమైన నిరుపేదలకు కెసిఆర్ ప్రవేశ పెట్టిన ఈ సహాయం అందడం లేదన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ నిరుపేదలకు  "అందని ద్రాక్ష" లాగానే ప్రభుత్వ సహాయం మారిపోయిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈ ఆర్థిక సహాయం లభించక దిక్కుతోచని పరిస్థితి లో బిక్కు బిక్కు మంటున్నారని అన్నారు.


కరోనా మహమ్మారి వైరస్ కారణంగా ఉన్న ఉపాధి కోల్పోయి వీరంతా నేడు రోడ్డున పడి, అప్పుల బాధలతో, తిండి లేక ఆకలికి అలమటిస్తూ పొట్టగడవని పరిస్థితి లో ఇక "'ఆత్మహత్య లే మాకు శరణ్యమా"' అనే ధీన స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించి ఈ పథకం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ అమలయ్యేటట్లు తక్షణమే  చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి కోరారు. నిబంధనల్లో సడలింపులు చేసి, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయం అందజేసి వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Related Posts