YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనాతో టీఆర్ఎస్ ద్విదశాబ్దివేడుకలు రద్దు

కరోనాతో టీఆర్ఎస్ ద్విదశాబ్దివేడుకలు రద్దు

హైదరాబాద్, ఏప్రిల్ 17, 
కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికే చాలా వాటిపై పడింది. తాజాగా తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కూడా పడింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను వాయిదా వేసుకుంది. ఈ నెల 27న పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వేడుకలు నిర్వహించకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేడుకలను వాయిదా వేయడమే సరైనదని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. త్వరలోనే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రెండు కార్పోరేషన్లు,ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.
తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 3,840 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. ఒక్క‌రోజులో కరోనాతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,198 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,09,594 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,797గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 30,494 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 20,215 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 505 మందికి క‌రోనా సోకింది.
కరోనా మహమ్మారి విషయంలో తెలంగాణ ప్రభుత్వం పలు సూచనలు చేస్తోంది. రోగులను మూడు విభాగాలుగా చేయాలని సూచించింది. సాధారణ కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు.. మధ్య స్థాయి రోగులు.. సీరియస్‌ రోగులుగా విభజించారు. సాధారణ రోగులను ఇళ్లల్లోనే ఉంచి చికిత్స చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ఆస్పత్రుల్లో పడకలు కేటాయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. మధ్యస్థాయి లక్షణాలున్న రోగులకు అవసరాన్ని బట్టి సాధారణ వైద్యం అందించి రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని నిర్ణయించింది. సీరియస్‌ రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు పడకలు కేటాయించాలని ఆదేశించింది. పడకలు, ఆక్సిజన్‌ వాడకం, రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల వినియోగం వంటి వాటి వాడకాన్ని క్రమబద్ధీకరించాలని.. అనవసరంగా వాడకూడదన్నారు.

Related Posts