న్యూఢిల్లీ, ఏప్రిల్ 17,
పీకల్లోతు అప్పుల్లో ఉన్న ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ కంపెనీ ఎయిర్ ఇండియా అమ్మకం పనులను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించింది. ఈ ఏడాది సెప్టెంబరులోపే కంపెనీ అమ్మకం పూర్తవుతుందని ప్రకటించింది. టాటా గ్రూప్ సహా పలు కంపెనీలు ఎయిర్ ఇండియా కోసం గత డిసెంబరులోనే ప్రిలిమినరీ బిడ్స్ వేశాయి. అర్హులైన బిడ్డర్లకు ఎయిర్ ఇండియా వర్చువల్ డేటా రూమ్ (వీడీఆర్) యాక్సెస్ ఇచ్చారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియాలను 2007లో విలీనం చేశారు. అప్పటి నుంచి ఎయిర్ ఇండియా నష్టాలతో సతమతమవుతోంది. ఈ కంపెనీలో వందశాతం వాటాలను అమ్మేయాలని ప్రభుత్వం చాలా కాలం క్రితమే నిర్ణయించింది. అయితే కరోనా వల్ల ప్రిలిమినరీ బిడ్స్ వేయడానికి గడువును ఐదుసార్లు పొడగించారు. ఎయిర్ ఇండియాను దక్కించుకున్న కంపెనీకి 4,400 డొమెస్టిక్, 1,800 ఇంటర్నేషనల్ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు దక్కుతాయి. విదేశీ ఎయిర్‌పోర్టుల్లోనూ ఎయిర్ ఇండియాకు 900 స్లాట్లు ఉన్నాయి. నష్టాలతో కునారిల్లుతున్న ఎయిరిండియాను అమ్మడం లేదా మూసేయడం తప్ప వేరే మార్గం లేదని కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఈ కంపెనీని ప్రభుత్వం నడపడం ఎంతమాత్రమూ సాధ్యం కాదని ప్రకటించారు. ఎయిరిండియాకు ఇప్పటికే రూ.60 వేల కోట్ల అప్పులు ఉన్నాయని, రోజుకు రూ.20 కోట్ల నష్టాలు వస్తున్నాయని వెల్లడించారు. కంపెనీని వందశాతం ప్రైవేటైజేషన్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిజానికి 2017లోనే కంపెనీ అమ్మకానికి బిడ్లను పిలిచినా, పెద్దగా స్పందన రాలేదు. బిడ్డరే మొత్తం అప్పును భరించాలన్న షరతు విధించడం ఇందుకు కారణం. కొంతకాలం తరువాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎంత అప్పును భరించాలన్నది సూటర్లకే వదిలేస్తున్నట్టు ప్రకటించింది.