హైదరాబాద్, ఏప్రిల్ 18,
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోందా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్స్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకురావొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి.7వ వేతన సంఘం సిఫార్సుల ప్రాతిపదికన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గత ఏడాదిలోనే నైట్ డ్యూటీ అలవెన్స్ మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే కోవిడ్ 19 కారణంగా అన్ని ప్రతిపాదనలు అలానే ఉండిపోయాయి. అయితే ఇప్పుడు కేంద్రం మళ్లీ వీటిని అమలులోకి తెచ్చే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.జూలై నుంచి డీఏ, డీఆర్ చెల్లింపుల నేపథ్యంలో నైట్ డ్యూటీ అలవెన్స్‌పై అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇదివరకటిలా బేసిక్ గ్రేడ్ పే ప్రకారం కాకుండా స్పెషల్ గ్రేడ్ పే ప్రాతిపదికన ప్రత్యేక నైట్ డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు. ఇంకా రూ.43,600కు పైన మూల వేతనం కలిగిన వారికి నైట్ డ్యూటీ అలవెన్స్ రాదు. ఇంకా అలవెన్స్ లెక్కింపు కూడా మారుతుంది. కాగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డ్యూటీ చేస్తే నైట్ డ్యూటీ కింద పరిగణిస్తారు.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం జూలై నుంచి ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ చెల్లింపులు నిర్వహించనుంది. మూడు ఇన్‌స్టాల్‌మెంట్లలోని డీఏ ఒకేసారి ఉద్యోగులకు వచ్చి చేరుతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఉద్యోగులకు, పెన్షన్ తీసుకునే వారికి ఊరట కలుగనుంది.