హైదరాబాద్, ఏప్రిల్ 18,
కరోనా రెండో దశ వ్యాప్తి రాన్రానూ ఉద్ధృతంగా తయారవుతున్న వేళ తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్ స్పందించారు. కరోనా మహమ్మారి దేశంలో మొదలయ్యాక మొదటిసారిగా రెండు లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మహమ్మారి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు, ప్రభుత్వ సహకారంతో మొదటి విడత కరోనా తాకిడిని నిలువరించగలిగామని, కానీ రెండో వేవ్‌లో వైరస్ మ్యుటేషన్ల కారణంగా తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. కోఠిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు.తెలంగాణలో కరోనా ప్రారంభం అయిన నాటి నుండి నమోదు కానీ కేసులు నేడు నమోదయ్యాయి. వైరస్‌కు మనం మోకరిల్లాలా లేక కుటుంబాలను కాపాడుకోవాలా అని జనాలే తేల్చుకోవాలి. రెండో వేవ్‌లో సుమారు రెండు కోట్ల నుండి ఏడు కోట్ల మంది బలి అయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. మహారాష్ట్ర నుండి తెలంగాణ సరిహద్దులో ఉన్న ఓ జిల్లాకు కొంతమంది ఓ వేడుక కోసం వచ్చారు. మహారాష్ట్ర వాసులకు మన వాళ్ళు కలిశారు. ఆ తర్వాత లక్షణాలు కనిపించడంతో వారిని టెస్ట్ చేస్తే వారికి పాజిటివ్ అని తేలింది. ఐదుగురు పాజిటివ్‌లతో ప్రారంభం అయిన సెకండ్ వేవ్ 12 రోజుల్లోనే 433 కేసులు నమోదు అయ్యాయి. సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉంటుందో అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ.’’వైరస్ డబుల్ మ్యూటేషన్ అయి రూపాంతరం చెందడం ఒక కారణం అయితే ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించక పోవడం కేసులు పెరగడానికి ప్రధాన కారణం. నిన్న ఒక్క రోజే తెలంగాణలో 1,20,232 పరీక్షలు నిర్వహించాము. ఒక పక్క వ్యాక్సినేషన్, టీటీటీలను సమర్థంగా నిర్వహిస్తున్నారు పబ్లిక్ హెల్త్ సిబ్బంది. తెలంగాణలో గత సెప్టెంబర్ వరకు 18 వేల బెడ్స్‌తోనే కోవిడ్‌ను ఎదుర్కొన్నాం. ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్‌లో ఆ బెడ్లను 38,852 వేల బెడ్స్ ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో 50 వేలకు పడకలు పెంచనున్నాం.గాలి ద్వారా వ్యాపించే దశకు కరోనా చేరిందని గతంలోనే స్పష్టంగా ప్రజలకు చెప్పాం. గతంలో ఇంట్లో ఒకరిని ఐసోలేట్ చేస్తే సరిపోయేది. ప్రస్తుతం బాధితుడిని గుర్తించేలోపే కుటుంబమంతా వైరస్ బారిన పడుతున్నారు. మ్యుటేషన్స్, డబుల్ మ్యుటేషన్స్, వివిధ దేశాల నుంచి ప్రయాణికుల ద్వారా వచ్చినవి కూడా రాష్ట్రంలో సర్క్యులేట్ అవుతున్నాయి. కొత్త మ్యుటేషన్ల కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. 15 రోజుల్లోనే పాజిటివ్ రేటు రెట్టింపు అయింది’’
పదికి పైగా బెడ్స్ ఉన్న అన్ని ప్రైవేటు హాస్పిటల్‌లో కరోనా వైద్యానికి అనుమతులు ఇచ్చాం. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ బెడ్ల కొరత లేదు. కొన్ని పేరు గాంచిన హాస్పిటల్స్‌లో మాత్రం బెడ్స్ కొరత ఉంది. వందమందికి కరోనా వస్తే అందులో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండట్లేదు. ఎక్కడా ఆక్సిజన్ బెడ్ల కొరత లేదు. మందుల కొరత లేదు. రేమిడిస్ విర్ అనేది ఇంకా ప్రయోగాత్మక మందు అంతే. వాటివల్ల కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేన్నీ అతిగా వాడొద్దు. కరోనా మైల్డ్ లక్షణాలు ఉన్న వారు రేమిడిస్ విర్ వాడకూడదు‘‘అందరూ రాబోయే జూన్ వరకు అప్రమత్తంగా ఉండండి. అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. 1,300 సెంటర్లలో కోవిడ్ వ్యాక్సినేషన్ నడుస్తోంది. రాష్ట్రంలో గత రెండు రోజులుగా వ్యాక్సిన్ కొరత కనిపిస్తోంది. ప్రస్తుతం మన వద్ద రెండు లక్షల డోసులు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు రేపటి వరకు సరిపోతాయి. ఇంకా మరో రెండు లక్షల డోసులు రాష్ట్రానికి వస్తాయని కేంద్రం నుండి సమాచారం అందింది.’’ అని శ్రీనివాసరావు అన్నారు.