YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిల పార్టీలోకి వెళితే...10 కోట్లు వస్తాయి

షర్మిల పార్టీలోకి వెళితే...10 కోట్లు వస్తాయి

హైదరాబాద్, ఏప్రిల్ 18,
తెలంగాణ రాజకీయ పార్టీ స్థాపనకు ఏర్పాట్లు చేసుకుంటున్న వైఎస్ఆర్ తనయ షర్మిలకు కొండా మురళి, సురేఖ దంపతులు షాకిచ్చారు. ప్రస్తుతం తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని, పార్టీ మార్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబానికి ఎంతో ఆప్తులైన కొండా దంపతులు షర్మిల పార్టీలోకి వెళ్లనున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన కొండా మురళి.. తమకు పార్టీలు, డబ్బుల కంటే ఆత్మాభిమానమే ముఖ్యమన్నారు. గతంలో పార్టీలు మారడం వల్ల తమకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని, అందువల్ల భవిష్యత్‌లోనూ అలాంటి ఆలోచనేదీ చేయబోమని స్పష్టం చేశారు.ఇటీవల ఖమ్మం సంకల్ప సభ వేదికగా తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ నేపథ్యంలో షర్మిల అనుచరులు..అధికార పార్టీ వ్యతిరేక వర్గాలతో పాటు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను ఆ పార్టీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ పలుకుబడి ఉన్న కొండా దంపతులను వారు సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో వారు షర్మిల పార్టీలోకి వెళ్లడం ఖరారైందన్న ప్రచారానికి తెరలేచింది. దీనికి ఆదిలోనే ముగింపు పలకాలన్న ఉద్దేశంతో వరంగల్‌లో పార్టీ కార్యకర్తలు, తమ అనుచరులతో కొండా దంపతులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కొండా మురళీ మాట్లాడుతూ. షర్మిల పార్టీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని స్పష్టం చేశారు. ‘షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేరబోమని చెప్పేశాం. మేం పార్టీ మారితే షర్మిల పదివేల కోట్లు ఇస్తుంది.. కానీ మాకు విలువలు, ఆత్మాభిమానమే ముఖ్యం’ అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ జైలులో ఉన్నప్పుడు ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశామని, కానీ బయటికి వచ్చాక ఆయన కనీసం తమను పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో పార్టీ, డబ్బు కంటే ఆత్మాభిమానమే ముఖ్యమన్నారు.‘మేం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. ఆపార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం. ప్రస్తుతం పార్టీకి జనంలో తిరిగే నాయకుడు అవసరం. నేను కరోనాతో చావుబతుకుల మధ్య పోరాడితే కొందరు టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్‌ను తట్టుకోగలవా.. అని హరీశ్‌రావు నన్ను బెదిరించాడు. చంద్రబాబునే తట్టుకుని నిలబడ్డా.. కేసీఆర్ ఎంత అన్నాను.’ అని కొండా మురళి తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై ఆయన సెటైర్లు వేశారు..ఏబీసీడీలు కూడా రాని మంత్రికి అవార్డులు రావడమేంటో అర్థం కావడం లేదన్నారు. ఓ వైపు ప్రజలు కరోనాతో చనిపోతుంటే.. మరోవైపు టీఆర్ఎస్ సంబరాలు చేసుకుటోందని విమర్శించారు.

Related Posts