న్యూఢిల్లీ ఏప్రిల్ 18,
క్యూబాలో క్యాస్ట్రో శకం ముగియనున్నది. కమ్యూనిస్టు పార్టీకి రౌల్ క్యాస్ట్రో గుడ్ బై చెప్పేశారు. పార్టీ నాయకత్వాన్ని యువతరానికి అప్పగించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ప్రారంభమైన పార్టీ సమావేశాల్లో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఆరు దశాబ్దాల పాటు క్యూబాను ఏలిన క్యాస్ట్రో పాలన ముగియనున్నది. రౌల్ క్యాస్ట్రో.. ఆయన సోదరుడు ఫిడేల్ క్యాస్ట్రో.. క్యూబాలో చాలా పాపులర్. 89 ఏళ్ల రౌల్ పార్టీ సమావేశంలో తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. పార్టీకి నమ్మకంగా పనిచేసినవారికే కొత్త నాయకత్వం లభిస్తుందన్నారు.అమెరికా సామ్రాజ్యవాద పెత్తానికి వ్యతిరేకంగా క్యాస్ట్రో సోదరులు చేపట్టిన పోరాటం క్యూబాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చి పెట్టింది. తన తర్వాత పార్టీకి పగ్గాలు చేపట్టబోయే వారి కోసం నాలుగు రోజుల కాంగ్రెస్ సమావేశాల తర్వాత ఓటింగ్ జరుగుతుందని, దాంట్లో కొత్త నేత ఎవరో తెలుస్తుందని రౌల్ తెలిపారు. 1959లో అమెరికా వ్యతిరేకంగా సాగిన ఉద్యమంతో క్యాస్ట్రో శఖం మొదలైంది. అయితే 2016లో ఫిడెల్ క్యాస్ట్రో మరణించారు. ఇక ఇప్పడు రౌల్ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో క్యూబా కమ్యూనిస్టు పాలనలో కొత్త తరం అనివార్యమైంది.కమ్యూనిస్టు పార్టీ బాధ్యతలు మిగుల్ డియాజ్ కానల్‌కు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనే ఆ దేశాధ్యక్షుడు. 2018లో ఆయన ఆ బాధ్యతలు చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు కూడా ఆయనకే దక్కనున్నాయి. ఒకవేళ ఆయన ఆ పదవి స్వీకరిస్తే, ఇక క్యూబా ఆర్థిక వ్యవస్థను మరింత సరళతరం చేసే చర్యలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. 60 ఏళ్ల మిగుల్‌ను పార్టీ సమావేశాల్లో రౌల్ మెచ్చుకున్నారు. మిగుల్ కొత్త తరం నాయకుడని ప్రశంసించారు.