YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వేద స్వరూపుడు గరుత్మంతుడు

వేద స్వరూపుడు గరుత్మంతుడు

భగవంతుని దర్శించే సాధనంగా వేదాలు వున్నవి. కాని సామాన్య మానవులకు వేదాధ్యయనం చేయడం ,వాటిని అర్ధంచేసుకొని ఆచరించడం ,తద్వారా భగవంతుని చేరడం అనేది కఠినమైన కార్యం. ఆందుకే మన మీద కరుణకలిగిన వేదములు  భగవంతుని దర్శనం సులభంగా కలిగేలా మరియొక రూపం ధరించాయి. ఆ స్వరూపానికి శిరస్సుగా వేదంలో వున్న తిరివృత్ మంత్రము, నేత్రాలు గా గాయత్రీ మంత్రము. దేహంగా వామదేవమనే వేద భాగము, రెండు రెక్కలుగా భృగత్త్..రత్నాంతరము మొదలైన వేదభాగాలు, కాళ్లుగా వేద చందస్సు గోళ్ళు గా తీక్షణ్యం అనే వేద భాగం , తోక రెక్కల చివర యజ్ఞాయజ్ఞం అనే వేదవిభాగం, ఆత్మగా స్తోమమ్  అనే వేదభాగాలతో ఆవిర్భవించినదే గరుత్మంతుని స్వరూపం. గరుడసేవ ఉత్సవాలలో భగవంతుని తన భుజాల మీద మోస్తూ మనలని వెతుకుతూ వచ్చే వేద స్వరూపుడైన గరుత్మంతుడు మనలని చూసి ' నీవు వేదాల సహాయంతో భగవంతుని వెతుకుతున్నావు. ఇదిగో ఆ భగవంతుని నీ వద్దకి తీసుకు వచ్చాను చూడు"  అని చెప్పి , పరమాత్మ పాదాలు పామరులకు సులభంగా చూపిస్తున్నాడు. 
గరుత్మంతుడు కశ్యప మహర్షికి , వినతకి ఆషాఢ మాసంలో శుక్లపక్ష పంచమి స్వాతి నక్షత్రం నాడు జన్మించాడు.  బొద్దు గా వున్న శరీరం  ,బంగారు రెక్కలు,  తెల్లని కంఠ భాగం గుండ్రని కళ్ళు, పొడవాటి నాసిక,  తీక్షణమైన గోళ్ళు కలిగి వున్నాడు. "గరు" అంటే  రెక్కలు అని అర్ధం. 'డ' ఆంటే ఎగిరేవాడు. రెక్కలతో ఎగురుతున్నందు వలన  గరుత్మంతుడని పిలువబడుతున్నాడు. సంస్కృతం లో 'గృ' ఆంటే వేద శబ్దాలని  తెలియ చేస్తుంది. వేదస్వరూపుడైనందున కూడా గరుత్మంతుడని పిలువబడుతున్నాడు. గరుత్మంతుని తల్లి అయిన వినత, తన సోదరి కద్రువతో ఒక పందెంలో ఓడిపోయింది. ఫలితంగా కద్రువకి ఆమె పుత్రులైన నాగులకి  బానిసగా బందీ అయినది. ఆమెను విడిపించడానికి దేవలోకం  నుండి అమృతం తేవాలని నిబంధన విధించింది కద్రువ. గరుత్మంతుడు దేవలోకం నుండి అమృతాన్ని తీసుకువచ్చి తన తల్లిని బానిసత్వం నుండి విడిపించాడు.
తన తల్లిని కద్రువ పిల్లలైన నాగులు బానిసగా చూసినందున  గరుత్మంతుడు వారి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. పాములను అణిచి తన దేహానికి అలంకరించుకున్నాడు. గరుత్మంతుడు  ఎనిమిది పాములను ఎనిమిది చోట్ల తన దేహం మీద అలంకరించుకున్నాడు. 
1. తలపై శంఖపాలుడు
2. కుడి చెవికి పద్ముడు
3.ఎడమ చెవికి మహాపద్ముడు
4. కంఠానికి మాలగా కార్కోటకుడు
5.జంద్యం గా వాసుకి
6.మొలత్రాడుగా తక్షకుని
7. కుడి చేతికి  గుళికుని
8.ఎడమచేతికి  శేషుని
ధరించినందువలన  గరుత్మంతుడు అష్టనాగ గరుత్మంతుడని" పిలువబడుతున్నాడు. మహావిష్ణువు ఒక సారి గరుత్మంతుని " నేను నీకు ఒక వరం యివ్వనా అని అడుగగా , " స్వామీ.. నాకు వరములు ఏమీ వద్దు. మీకు ఏదైనా వరం  కావాలంటే మీరు కోరుకోండి నేను యిస్తాను." అని అన్నాడు. గరుత్మంతుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్య పడిన మహావిష్ణువు, " నీవు నా వాహనంగా వుండు." ఆని గరుత్మంతుని వరమడిగాడు. దానికి అంగీకరించి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనాడు. అన్ని వైష్ణవ దేవాలయాలలోను మహా విష్ణువు సన్నిధికి ఎదురుగా గరుత్మంతుని సన్నిధిని దర్శిస్తాము.  ఎందుకంటే మనం అలంకరించు కునేటప్పుడు అద్దం చూసుకుంటాము  అదేవిధంగా అలంకార ప్రియుడైన మహావిష్ణువు  అలంకారం చేసుకునేటప్పడు ఒక అద్దం కావాలి కదా.. భగవంతుడు దర్శించే అద్దం వేదం. గరుత్మంతుడు వేదస్వరూపుడైనందున గరుత్మతుని  అద్దంగా చేసుకుని మహావిష్ణువు తన అందం దర్శించుకుంటున్నాడు. అందుకే మహావిష్ణువు సన్నిధికి ఎదురుగా గరుత్మంతుని సన్నిధి వుంటుంది.  వైష్ణవాలయాలలో బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ధ్వజాల మీద గరుత్మంతుని పటం చిత్రీకరించి ఎగురవేస్తారు.
తిరుపతి వేంకటేశ్వరుని ఏడుకొండలలో ఒక కొండ పేరు గరుడాద్రి అని పిలువబడుతున్నది. రామరావణ యుధ్ధం లో ఇంద్రజిత్ ఉపయోగించిన
నాగపాశంతో బంధించబడి   రాముడు ,వానరసేన స్ప్రహ తప్పిన సమయంలో గరుత్మంతుడు ఆకాశం నుండి క్రిందకి దిగి ఆ నాగపాశాలని ధ్వంసంచేసి రామునికి, వానరసేనలకి స్ప్రహ వచ్చేలా చేశాడు.  గరుత్మంతుని పూజించినందువలన విషజంతువుల నుండి వచ్చే భయాలు తొలగి కుటుంబంలో సకల శుభాలు జరుగుతాయి.  గరుత్మంతునికి అనేక పేర్లు.. పక్షి రాజు, వైనతేయుడు, గరుత్మంతుడు, సుపర్ణుడు, తారక్షయుడు, కాశ్యపేయుడు, సుదాహరుడు , ఖగేశ్వరుడు, నాగాంతకుడు, విష్ణురధుడు. గరికరాజు,  మంగళాలయుడు, పెద్దదాస భక్తుడు మొదలైన పేర్లతో పిలువబడుతున్నాడు  వేదస్వరూపుడైన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు కి రెండవ రూపమే. జ్ఞానం, బలం శక్తి, తేజస్సు, ఐశ్వర్యం మొదలైన గుణాలు కలిగినవాడు గరుత్మంతుడు. సప్త స్వరాలకి ఆధారమైన సామవేద స్వరూపం. అష్టమహా సిధ్ధులను పొందిన వాడు గరుత్మంతుడు. గరుత్మంతుని దేహం సదా నూతనంగా చైతన్యవంతంగా వుంటుంది. 
లెక్కలేన్ని రూపాలలో గరుత్మంతుడు వున్నందున గరుడ సేవ ఉత్సవాలలో అనేక రూపాలతో ప్రదర్శించబడడం మనం చూస్తాము. తంజావూరు లో జరిగే  24 గరుడసేవ ఉత్సవాలు, కాంచీపురం  - వందవాసి మార్గంలోని కూళమందలు లో జరిగే 15 గరుడసేవలు, అక్షయతృతీయ రోజున కుంభకోణంలో 12 గరుడ సేవోత్సవాలు, శీర్కాళి కి సమీపాన వున్న తిరునాంగూరులో జరిపే11 సేవలు, తిరునల్వేలి సమీపాన వున్న ఆళ్వారు తిరునగరులో 9 గరుడసేవ ఉత్సవాలు, శ్రీ విల్లిపుత్తూరులో జరిగే 5 గరుడసేవోత్సవాలే ఇందుకు నిదర్శనం. 
నాచ్చియార్ ఆలయంలో రాతి శిల్ప గరుత్మంతుడు తనే ఉత్సవమూర్తిగా, మూలమూర్తిగా, వాహనమూర్తిగా గరుత్మంతుడు దర్శనమిస్తున్నాడు. 
 

Related Posts