మహబూబ్ నగర్, ఏప్రిల్ 19,
శుభకార్యాలకు తోరణాలుగా వాడే మామిడి చెట్లకే వివాహం చేస్తే ఎలా ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి శివారులో మామిడి తోటలో అదే జరిగింది. మామిడి చెట్లకు వివాహ తంతు ను ఘనంగా నిర్వహించారు తోట యజమాని. వేద పండితులతో మంత్రోచ్ఛరణల మధ్య, సాంప్రదాయబద్దంగా వివాహం జరిపించారు. మంగళ సూత్రం కట్టి, మెట్టెలు పెట్టి తోట యజమాని ఓ చెట్టు వైపు, వారి బందువులు మరో చెట్టు వైపు బందువులుగా వ్యవహరిస్తూ అచ్చం మనుషుల పెండ్లి మాదిరిగానే తంతు నిర్వహించారు.
జిలకర, బెల్లం, తాళి, మెట్టెలు, కొబ్బరికుడకలు, తలంబ్రాలు, కొత్తవస్త్రాలు, విందు బోజనాలు ఇలా ఏది తగ్గకుండా ఘనంగా పెళ్లి కార్యక్రమం చేపట్టారు. ఇక పెళ్లి తంతులో భాగంగా ఇలా అరుందతి నక్షత్రం కూడా చూసి దండం పెట్టుకున్నారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని, మామిడి తోట పెంపకం చేపట్టి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వివాహం చేయించినట్లు రైతు పేర్కొంటున్నారు. దీనివల్ల తోటకు చీడపీడల బాధ తప్పుతుందని, చెట్ల ఆయుష్షు పెరిగి మంచి పూత, కాపు కాయడంతో పాటు, మంచి లాభాలు వస్తాయని రైతుల నమ్మకంగా, పూత రైతులు భావిస్తారు. కాగా ఈ వేడుక అనంతరం బంధు మిత్రులకు మామిడి తోటలోనే విందు భోజనం ఏర్పాటు చేశారు. తమకున్న ఐదెకరాల్లో బాలు నాయక్, తావూర్ నాయక్ లు మామిడి చెట్లను నాటారు. తోట సాగు చేసి ఐదేళ్లు అవుతుండటంతో పాటు ఈ సారి కాత కూడా చేతికొచ్చే దశలో తోట ఉంది. తోట కాయ తెంచే ముందు ఇలా వివాహ తంతు నిర్వహించాలని తమ పూర్వీకులు చెప్పారని అందుకే చెట్లకు వివాహం చేశామంటున్నారు రైతులు. తోట లోని చెట్లు కూడా కొన్ని చనిపోవడం, మరికొన్ని కాత దశకు రాకపోవడంతో ఇలా చేస్తే వస్తాయిన చెప్పడంతో , వివాహ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. లోక కళ్యాణ వ్రుక్షం అయిన మామిడి చెట్లకు పెళ్లి జరిపిస్తే మంచి జరిగి మంచి కాపు కాస్తుందని ఇక్కడి వారి నమ్మకం. పురాణాల్లో మహరుషులు ఇలాంటి చెట్ల వివాహ కార్యక్రమాలు నిర్వహించారని, అదే ఆనవాయితీగా పలు చోట్ల చెట్ల పెళ్లి చేస్తున్నామని పురోహితులు పేర్కొంటున్నారు. ఇలా చేస్తే అశుబాలు తొలగిపోతాయని అంటున్నారు. ఏది ఏమైనా మనకు వింతగా అనిపించినా సంప్రదాయాలు , నమ్మకాలు కంప్యూటర్ యుగంలో కూడా కొనసాగించడం ఆశ్చర్యమే.