హైదరాబాద్, ఏప్రిల్ 19,
ఏపీ, తెలంగాణ జుట్టు జుట్టు పట్టుకుంటే కేంద్రం ఆ గొడవను పరిష్కరించడం కంటే ఎంజాయ్ చేసేందుకే సిద్ధంగా ఉందా ? అంటే అవుననే చర్చలు నడుస్తున్నాయి. సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తూ నిర్ణయాలు తీసుకునేందుకు అప్పట్లోనే మూడు సమావేశాలు జరిగాయి. ఈ సమన్వయ సమావేశాల బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. ఈ సమావేశాల్లో ఎవరికి వారు వాదనలు వినిపించారు. ముఖ్యంగా సెక్షన్ 9, సెక్షన్ 10లలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ఉంది. అయితే ఈ ఆస్తుల విభజనలో తెలంగాణ ప్రభుత్వం తనంతట తానుగా జీవోలు జారీ చేసేసుకుని అక్కడ ఉన్న ఆస్తులు అన్నీ తమవే అని తీర్మానించేసుకుంది. దీనిపై అప్పటి ఏపీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లగా సుప్రీం సైతం ఈ విషయాన్ని కేంద్రమే పరిష్కరించాలని చెప్పింది. నాటి ఉమ్మడి హైకోర్టు ఇదే విషయం స్పష్టం చేసింది.ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే క్రమంలో మేం పరిష్కరించుకుంటామంటూ మళ్లీ అప్పటి సీఎంలు వెనక్కు తగ్గారు.ఇక కేంద్ర హోం శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి ఉంది. అయితే హోం శాఖ కార్యదర్శులు సీనియార్టీ ప్రకారం ప్రతి 9-10 నెలలకు మారిపోతుంటారు. వీరి ముందు ఇక్కడ సమస్య చెప్పడం వారు నిర్ణయం తీసుకునేలోగానే మారిపోతుండడం.. మళ్లీ కొత్త కార్యదర్శి ముందుకు ఈ పంచాయతీ వెళ్లడం.. ఆయన కూడా మారిపోవడం ఇలా రెడ్డి వచ్చే మొదలు అన్నట్టుగా మారిపోతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, ఇతరత్రా వివాదాల్లో జగన్ సీఎం అయిన వెంటనే కొన్ని పరిష్కారం అయినా మరికొన్ని మాత్రం అలాగే ఉండిపోయాయి.ఇక ఈ వివాదంలో ఎవరో ఒక హోం శాఖ కార్యదర్శి డేరింగ్ డెసిషన్ తీసుకుంటే వివాదం సులువుగానే పరిష్కారం అవుతుంది. కానీ వాళ్లు కూడా కావాలనే నాన్చుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త హోం సెక్రటరీ మళ్లీ ఇరుపక్షాల వాదనలు వినబోతున్నారు. ఆయన కూడా వీటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ ఇది వాయిదా పడిపోవడం ఖాయం. ఈ కొత్త హోం సెక్రటరీకి కూడా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఆంశాన్ని తొలి రెండేళ్లలోనే తేల్చుకోవాల్సి ఉంది. ఇక విభజన చట్టంలో వీటికి 10 ఏళ్ల గడువు ఉంది. పదేళ్లలో కూడా ఇవి కొలిక్కి రాకపోతే అప్పుడు విషయం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పైకి అలయ్ బలయ్‌గానే ఉంటున్నారు. జగన్ సీఎం అయిన కొద్ది నెలల వరకు వీరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నీటి సమస్యలతో పాటు ఇతర సమస్యల్లో వీరిద్దరి మధ్య గ్యాప్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. రాజకీయ పరమైన అంశాల నేపథ్యంలో వీరు రాజీపడకపోవడంతో అంతర్గతంగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ గ్యాప్‌నే కేంద్రం అలుసుగా చేసుకుని ఈ వివాదం పరిష్కారం కాకుండా ఉండేలా కాలయాపన చేస్తూ వస్తుంది. చివరకు పదేళ్ల తర్వాత దానిని కూడా బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా వాడుకునేలా ఉన్నట్టే ఉంది.