YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ కు భారీ గిఫ్ట్....

పవన్ కు భారీ గిఫ్ట్....

తిరుపతి, ఏప్రిల్ 20, 
బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదాని మడతేసి ప్రత్యేక ప్యాకేజి అని చెప్పిన నాడు జనసేనాని పవన్ కళ్యాణ్ అన్న మాట పాచిపోయిన లడ్డూలు ఏపీకి ఇస్తారా అని. ఆ తరువాత అదే పవన్ బీజేపీ పంచన చేరారు. ఇక ఇపుడు పవన్ అలకలను మెల్లగా తీరుస్తూ బీజేపీ మచ్చిక చేసుకుంటోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ను కాబోయే సీఎం గా ఏకంగా సోము వీర్రాజు ప్రకటించి సంచలనం రేపారు. పవన్ కళ్యాణ్ ను చాలా జాగ్రత్తగా గౌరవంగా చూసుకోమని బీజేపీ పెద్దలు తమకు చెప్పారని కూడా సోము చెప్పుకున్నారు. మొత్తానికి పవన్ అలక కొంత తీరి తిరుపతి ఎన్నికల ప్రచారానికి వచ్చి వెళ్లారు.బీజేపీకి తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచిపోదామని పెద్ద ఆశలు ఏవీ లేవు. కనీసం రెండున్నర లక్షల ఓట్లు అయినా పడితే అవే పది లక్షల ఓట్లు అనుకుంటోంది. ఎందుకంటే అన్ని ఓట్లు కనుక వస్తే వచ్చే ఎన్నికల నాటికి పునాది వేసుకోవచ్చు అన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. ఇక ఈ ఓట్లను చూపించి ఏపీలో టీడీపీ పని అయిపోయింది అని అర్జంటుగా దండోరా వేస్తారు. వైసీపీ మీద వ్యతిరేకత దారుణంగా వచ్చేసిందని కూడా టముకు వేస్తారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టుకుని ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బీజేపీ కోరిక. మరి పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు, జనాలు కూడా ఆ సభకు కుమ్మేశారు. దీని ఫలితం ఏమైనా ఉంటుందా అన్నదే ఇపుడు చర్చ.
ఇక బీజేపీ కోరుకుంటున్నట్లుగా రెండు లక్షలకు పైగా ఓట్లు వచ్చి కమలం బుట్టలో చేరితే ఇక కాషాయ దళాన్ని ఏపీలో పట్టలేమని అంటున్నారు. కమలం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ ని అసలు విడిచి పెట్టే ప్రసక్తే ఉండదని కూడా చెబుతున్నారు. ఇంత చేసిన పవన్ కి పెద్ద బహుమతే ఇస్తారని చెబుతున్నారు. పవన్ కి రాజ్యసభ సీటు ఇచ్చి అధికారిక హోదాను ఖరారు చేస్తారు అంటున్నారు. కేరళలో బీజేపీకి మద్దతుగా నిలిచిన సురేష్ గోపి అనే హీరోకి పెద్దల సభలో చోటిచ్చారు. ఆయన కంటే పవన్ కళ్యాణ్ ఏమి తక్కువ. అందుకే దక్షిణాదిన సినిమా నటుల గ్లామర్ తో పాతుకుపోవాలనుకుంటున్న బీజేపీ పవన్ని ఎంపీని చేస్తుంది అంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ తో సాన్నిహిత్యం మరింత కుదిరితే ఏపీ కోటాలో ఆయనని కేంద్ర మంత్రిని కూడా చేస్తారు అంటున్నారు. ఏపీలో బలమైన వైసీపీని ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ కి కూడా అధికార పదవి ఉండాలని కూడా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారుట. అయితే ఇక్కడ మాత్రం షరతులు వర్తిస్తాయి అంటున్నారు. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తేనే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. ఏపీలో జనసేన ఎంత గింజుకున్నా అయిదారు శాతం ఓట్లే వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పవన్ కి కూడా ఈ ఒప్పందం నచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మొత్తానికి పవన్ కి బీజేపీ భారీ గిఫ్ట్ నే రెడీ చేసి పెట్టిందని అంటున్నారు. ఇవన్నీ జరగాలంటే తిరుపతిలో బీజేపీకి లక్షల్లో ఓట్ల పంట పండాలిట. మరి అది జరిగితేనే ఇది కూడా జరుగుతుంది అంటున్నారు. మొత్తానికి ఈసారి పవన్ కోసం కమ్మని తిరుపతి లడ్డూలే సిధ్ధంగా ఉన్నాయన్నమాట.

Related Posts