YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సెకండ్ వేవ్ లో దోపిడీ

సెకండ్ వేవ్ లో దోపిడీ

విజయవాడ, ఏప్రిల్ 20,
సెకండ్ వేవ్ లో కరోనా కరాళ నృత్యం మొదలు పెట్టింది. అంతకుమించి ప్రయివేట్ ఆసుపత్రుల దందా తారాస్థాయికి చేరింది. అడ్డు అదుపు లేని రీతిలో ప్రైవేట్ ఆసుపత్రులు సాగిస్తున్న వ్యాపారంపై అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయలేని పరిస్థితి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. కరోనా సోకి రోగి ప్రాణాలు పోయినా పోకపోయినా ఆసుపత్రుల బిల్లులు చూస్తే గుండెలు ఆగే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఈ వ్యవహారాలు కళ్ళకు కట్టినట్లు అందరికి తెలిసినా సర్కార్ మాటల్లో చెబుతున్న హెచ్చరికలు చేతల్లో మాత్రం లేకపోవడం తీవ్ర విమర్శలకు తెరతీస్తోంది.ప్రస్తుతం కరోనా వైద్యంలో కీలక సమయంలో రెమ్ డెసివర్ సంజీవనిగా పనిచేస్తుంది. దాంతో ఈ మందు పై కేంద్రం ఎన్ని నియంత్రణలు చేస్తున్నా బ్లాక్ మార్కెట్ లోనే తప్ప సాధారణంగా లభ్యం కావడం లేదు. డిమాండ్ కి తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ఏడు కంపెనీలకు అనుమతులను కేంద్రం ఇచ్చినా ఫలితం కనిపించడం లేదు. ఫస్ట్ వేవ్ లో 20 వేల నుంచి 35 వేలరూపాయల వరకు బ్లాక్ లో ఉండగా ఇప్పుడు కూడా అదే తీరులో లభించడం గమనార్హం. దాంతో ప్రభుత్వం చెబుతున్న మాటలకు వాస్తవంగా మార్కెట్ లో లభిస్తున్న రేటు కు పొంతన లేకుండా పోయింది. కంపెనీ ని బట్టి మూడు వేల రూపాయలనుంచి ఏడు వేలరూపాయల లోపు మాత్రమే ఈ మందును విక్రయించాలిసి ఉంది. ఒక రోగికి సుమారు ఆరు ఇంజెక్షన్ లను కోర్స్ గా వినియోగిస్తున్నారు. దాంతో బ్లాక్ లో కొనుగోలు చేసేవారు ఈ ఒక్క ముందుకే లక్ష రూపాయలకు పైగా వెచ్చించాలిసి వస్తుంది.మూడు రోజుల ప్యాకేజీ, ఐదు రోజుల ప్యాకేజీ, పది రోజుల ప్యాకేజీ 14 రోజుల ప్యాకేజీ అంటూ రెండు లక్షల రూపాయల నుంచి మొదలు అవుతుంది. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రకమైన ఫీజులు నిర్ధారిస్తున్నాయి. రోజుకు కనీసం 50 నుంచి 90 వేలరూపాయలు పీకేస్తున్నారంటే ప్రైవేట్ ఆసుపత్రులు దందా ఎంత దారుణంగా ఉందొ చెప్పొచ్చు. ఇలా ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగులకు ఆఫర్లు పెట్టి లక్షల రూపాయలను గుంజుతున్నాయి. దాంతో పేషేంట్ బయటకు వచ్చేటప్పటికి వారి కుటుంబం ఆర్ధికంగా అప్పులపాలు కావాలిసి వస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా అయితే ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకు ఒక పేషంట్ దగ్గర 3250 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. రోగి కి ఐసియు చికిత్స జరపాలిసి వస్తే 5480 రూపాయలు, వెంటిలేటర్ పై ఉంచితే రోజుకు 10380 రూపాయలు, రూమ్ ఛార్జ్ గా 600 రూపాయలు పీపీఈ కిట్లు వైరస్ నిర్ధారణ కిట్లకు అదనపు ధరలను వసూలు చేయొచ్చు కానీ ఈ ధరలను ఏ ఆసుపత్రి అమలు చేస్తున్నదే లేదన్నది రోగుల గగ్గోలు. దీనికి తోడు కరోనా వైద్యం చేయడానికి అనుమతి లేని ఆసుపత్రులు సైతం కోకొల్లలు. అయినా వీటిని నియంత్రణ చేయాలిసిన వ్యవస్థలు నిద్రాణంలో ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరస్ మరింత విజృంభిస్తుందన్న నిపుణల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు మేల్కొని ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్ పెట్టక పోతే సామాన్యుల పరిస్థితి అంతే సంగతి అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

Related Posts