YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజభవన్ కు జగన్ కు మధ్య గ్యాప్..?

రాజభవన్ కు జగన్ కు మధ్య గ్యాప్..?

విజయవాడ, ఏప్రిల్ 20, 
ఏపీలో రాజకీయ ఆపరేషన్ చేపట్టడానికి బీజేపీ రెడీ అవుతున్నట్లుగా ఉంది. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దగ్గర పడుతోంది. కేంద్రంలో మోడీ కూడా రెండవసారి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది. బీజేపీ వైసీపీల మధ్య పొలిటికల్ హానూమూన్ దాదాపుగా ముగిసింది అని కూడా అంటున్నారు. ఎవరు ఎవరికి ఎంతవరకూ ఉపయోగపడతారు, ఎంతవరకూ ప్రతికూలమవుతారు అన్న దాని మీద కూడా పూర్తిగా స్పష్టత వచ్చింది. దాంతో ఏపీ విషయంలో బీజేపీ తనదైన ఆలోచన చేయనుంది అంటున్నారు. ఏపీకి కేంద్రం ఏం చేసింది అని చాలా మంది ప్రశ్నిస్తారు కానీ రాజకీయంగా జగన్ పాలన సాఫీగా సాగడానికి తెర వెనక నుంచి మద్దతు బాగానే ఇచ్చింది. జగన్ తో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండడం వల్లనే బీజేపీ ఈ రకంగా వ్యవహరించింది అని చెప్పాలి. ముఖ్యంగా రాజ్యాంగ సంస్థలతో జగన్ కి పెద్దగా పేచీలు రాలేదు. ఒక వేళ ఎక్కడైనా వచ్చినా స్మూత్ గా డీల్ చేసుకునేలా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆసరా ఇచ్చారు. ఇకపైన కారాలూ మిరియాలే తప్ప సహకారాలు అన్నవి అసలు ఉండవని అంటున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే గవర్నర్ జగన్ సర్కార్ కి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. జగన్ సర్కార్ ఏ బిల్లు పంపినా కూడా ఆయన ఆమోదముద్ర వేస్తున్నారు. ప్రభుత్వానికి ఆయన తన వంతుగా అండగా ఉంటున్నారు. గత ఏడాది మూడు రాజధానుల బిల్లుని పంపితే గవర్నర్ దాని మీద కూడా ఆమోదముద్ర వేశారు. అలాగే బీజేపీ సహా విపక్షాలు వ్యతిరేకించే అనేక బిల్లులకు గవర్నర్ సంతకం పెట్టి వైసీపీకి ఏ చిక్కులూ లేకుండా చేశారు. ఇపుడు అలాంటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ని తప్పిస్తారు అన్న ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. తెలంగాణాలో బీజేపీలో క్రియాశీలంగా ఉన్న తమిళ్ సై ని గవర్నర్ గా కేంద్రం నియమించింది. ఆమె చురుకైన పోకడలతో కేసీయార్ సర్కార్ అక్కడ ఇబ్బందులు పడుతున్న సంగతి విదితమే. గవర్నర్ ప్రతీ విషయం మీద ఆరా తీయడం సొంతంగా నివేదికలు తెప్పించుకోవడం వంటివి చేస్తూ కేసీయార్ సర్కార్ కి చెక్ పాయింట్ గా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా అలాంటి గవర్నర్ నే ఏపీకి కూడా తేవాలని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు అంటున్నారు. ప్రస్తుత గవర్నర్ వయోభారంతో ఉండడం వల్ల కూడా చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు అన్న భావన ఉందిట. దాంతో కరడుకట్టిన బీజేపీ నేతను ఏపీ రాజ్ భవన్ లో పెట్టడం ద్వారా జగన్ దూకుడు కి చెక్ చెప్పాలని కేంద్ర బీజేపీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లుగా భోగట్టా. అదే జరిగితే జగన్ కి కొత్త చిక్కులు మొదలైనట్లే.

Related Posts