న్యూ ఢిల్లీ ఏప్రిల్ 20
సిరియాలోని ఉగ్రవాద శిక్షణ క్యాంపుపై రష్యా యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆ దాడిలో సుమారు 200 మంది మిలిటెంట్లు మృతిచెందినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో 24 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరో అర టన్ను పేలుడు పదార్ధాలు ధ్వంసం అయినట్లు సైన్యం పేర్కొన్నది. సిరియా నదిలో ఉగ్రవాద క్యాంపు నడుపుతున్న దళాలపై రష్యా వైమానిక దళం దాడి చేసినట్లు అడ్మిరల్ అలక్సందర్ కార్పొవ్ తెలిపారు. పల్మైరా ప్రాంతంలో ఉన్న క్యాంపులో ఉగ్రవాదులు అక్రమ రీతిలో పేలుడు పదార్ధాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.మిలిటెంట్ల క్యాంపుల్లో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని, సిరియా అధికారుల ఆధీనంలో లేనటువంటి ప్రాంతాల్లో ఈ ఘాతుకాలు చోటుచేసుకుంటున్నాయని రష్యా ఆర్మీ తెలిపింది. 2015 నుంచి సిరియాలో రష్యా సైనిక చర్యలు నిర్వహిస్తోంది. అధ్యక్షుడు అసద్ బాషర్‌కు ఆ దేశం సహకరిస్తున్నది. ఇద్దరు రష్యా సైనికులను చంపినట్లు ఇస్లామిక్ స్టేట్ పేర్కొన్న నేపథ్యంలో.. ప్రతీకారంగా రష్యా వైమానిక దాడులకు దిగినట్లు తెలుస్తోంది.