హైద్రాబాద్, ఏప్రిల్ 21,
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ నిత్యావసరాల కొరత లేకుండా ప్రజలకు విశేష సేవలందించడంలో గల్లీ కిరాణా దుకాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసు కట్టడి, దూరపు ప్రయాణాల నియంత్రణ, ప్రభుత్వాల హెచ్చరికల నేపథ్యంలో వినియోగదారులంతా ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా కిరాణా దుకాణాల మీదే ఆధారపడుతున్నారు. తాజా సరుకులు అందిస్తూ, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటుండటంతో 94 శాతం వినియోగదారులు ఈ దుకాణాల వైపే మొగ్గు చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో నిత్యావçసర సరుకులు అందుబాటులో ఉంచడంలో కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్‌లు, స్టోర్‌లు, ఈ–కామర్స్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. అయితే లాక్‌డౌన్‌తో సాధారణంగా వారానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసే అలవాటుకు భిన్నంగా వినియోగదారులు నెల రోజులకు సరిపడా సరుకుల కొనుగోలు చేశారు. దీంతో పెద్దపెద్ద సూపర్ మార్కెట్‌లు, స్టోర్‌లలో సరుకులు నిండుకున్నాయి. అదీగాక చాలా స్టోర్‌లలో పనిచేసే 20 నుంచి 30 మంది సిబ్బందిలో ప్రస్తుతం 5 మంది కూడా అందుబాటులో లేరు. దీనికి తోడు సరుకులు తెచ్చే వాహనాల రవాణాలో ఇబ్బందులు, గోదాముల్లో సరుకుల ప్యాకేజింగ్‌కు సిబ్బంది కొరత నేపథ్యంలో పెద్ద మార్కెట్‌లు చేతులెత్తేయడంతో వినియోగదారులంతా కిరాణా దుకాణాల వైపు మళ్లారు.దేశవ్యాప్తంగా 6.65 మిలియన్ల కిరాణా దుకాణాలు ఉండగా, రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కిరాణా దుకాణాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి పది కుటుంబాలకు ఒకటి చొప్పున అందుబాటులో ఉన్నాయి. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు ఈ దుకాణదారులే లక్ష్యంగా సరుకుల సరఫరా పెంచారు. అదీగాక సరుకుల కొనుగోలుకు 3 కి.మీ. దాటి వెళ్లరాదన్న పోలీసుల నిబంధనతో పాటు కిరాణా దుకాణాల వద్ద పక్కాగా అమలవుతున్న పరిశుభ్రత, ఇంటి దగ్గరలోనే కొనుగోలు, నాణ్యత, ప్రయాణ సౌకర్యాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 94 శాతం మంది వినియోగదారులు కిరాణా దుకాణాల మీదే ఆధారపడుతున్నారని ‘బిజినెస్ టూ బిజినెస్’సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గతంలో ఈ వాటా కేవలం 82 శాతంగా ఉండేదని తెలిపింది. దీనికి అదనంగా కిరాణా దుకాణాదారులు సైతం డిజిటల్ చెల్లింపులను పెంచారు. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా చెల్లింపులు జరపడం వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది. కిరాణా దుకాణాల ద్వారా సరుకుల కొనుగోళ్లు జరుగుతుండటంతో హోల్‌సేల్ వ్యాపారులు సైతం వీటికి సరఫరా పెంచారు. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులను సైతం కిరాణా దుకాణాలు నిర్ణీత ధరలకే అమ్ముతున్నాయి. వీటితో పాటే చాలా కిరాణా దుకాణాల్లో టమాటా, ఉల్లిగడ్డ, నిమ్మకాయలు, కొన్ని రకాల పండ్ల అమ్మకాలు సైతం మొదలు పెట్టారు. వినియోగదారుల నుంచి వచ్చిన డిమాండ్‌ను బట్టి అదనపు సరుకులు అందుబాటులో ఉంచుతున్నారు.ఇది కూడా దుకాణాల వైపు మొగ్గు చూపేందుకు కలిగి స్తోంది. ‘స్థానిక కిరాణా దుకాణదారులపై వినియోగదారులకు నమ్మకం ఎక్కువ. ధరలు అందుబాటులో ఉంచడంతో పాటే నాణ్యమైన సరుకును అందించడంతో నమ్మకం కలిగిన అమ్మకందారులని విశ్వసిస్తారు. అయితే వీరు మరిన్ని సౌకర్యాలు అప్‌గ్రేడ్ చేసుకుంటే వీరిపై ఆధారపడే వారి సంఖ్య మరింత పెరుగుతుంది’అని సర్వే వెల్లడించింది.