రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
రామాయణ మహాకావ్యములో ఉన్న కాండలలో సుందరకాండ ఉత్కృష్టమైనది. పరమ పావనమైనది. ఆ కాండకు సుందరకాండ అనే పేరు మునివర్యులు, కవి అయిన వాల్మీకి ఎందుకు పెట్టాడన్నది ప్రశ్న. దానికి వాల్మీకి ఎక్కడా వివరణ ఇవ్వలేదు మనకు.
సుందర కాండకు మరి ఆ పేరెందుకు వచ్చి ఉంటుంది?
అన్ని కాండలకు పేర్లు బట్టి అందులో గల విషయము ఏమిటో చెప్పగలము. కానీ ఈ సుందరకాండకు మాత్రము ‘సుందరకాండ’ గా ముని ఎందుకు పేరు పెట్టాడో ఆలోచించవలసి ఉన్నది. అది ఏ సముద్రకాండో, లంకా కాండో అని కాకుండా, ‘సుందర కాండ’ అని పేరు పెట్టటములో ఆంతర్యమేమున్నది?
ఈ కాండ 67 సర్గలతో ఉన్నది. ఇందు మనకు అణువణువు హనుమనే కనబడుతాడు. మొదలైనప్పటి నుంచీ చివర వరకూ ఈ కాండ అంతా హనుమ గురించే. హనుమ జిత్రేంద్రియుడు. ప్రజ్ఞానవంతుడు. సీత జాడ తెలియక లంకలో వెతుకుతూ-
“నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యై చ తస్యై జనకాత్మజాయై।
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో। నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః॥” అని శరణాగతి చేసి సీతను కనుగొంటాడు. ఇటు వంటి హనుమ అందము గురించా ముని చెప్పింది?
వాయువు మనకు ప్రాణము. వాయువు లేనిదే క్షణమాత్రము మనము జీవించలేము. “త్వమేహం ప్రత్యక్షా బ్రహ్మాః” అని ప్రజలు సేవించే వాయువు కుమారుడు హనుమంతులవారు. వాయు నందనుడు అణువణువు ఉన్నందున ఈ కాండకు సుందరకాండయని పేరా? అటువంటప్పుడు హనుమ కాండఅని పేరు పెట్టవచ్చు కదా? అలా కాక సుందరకాండ అని పేరు పెట్టడములో ముని యొక్క ఆంతర్యము హనుమ గురించి కాదని మనకు తెలుస్తుంది.
లంకా నగరము చాలా సుందరమైన నగరము. విశ్వకర్మచే నిర్మించపడి, ఉద్యానవనాలతో, విశాలమైన వీధులతో, ఎతైన బంగారు భవనాలతో ఎంతో మనోహరమైన నగరము. లంకా నగరము చాలా సుందరమైనదని మనకు చెప్పటానికి దీనికి సుందరకాండ యని పేరు పెట్టారా? లంకా నగరము యొక్క అందము బాష్యమైనది. అది నేడు ఉంటుంది. రేపు ఉండకపోవచ్చును. మరి అంత అశాశ్వతమైన అందమును తెలుపుటానికి ముని ఈ కాండకు ఆ పేరు పెట్టారంటే మనము నమ్మలేము.
ఇందులో హనుమ రాముని దూతనని, జయ మంత్రము పలికెనని సుందరమైనదా?
“జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః॥
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః॥” అని హనుమ ప్రకటించినాడు కదా. మహాబల సంపన్నుడైన రాముని జయము. మిక్కిలి పరాక్రమశాలి లక్ష్మణునికి జయము. శ్రీరామ విధేయుడైన సుగ్రీవునికి జయము. కోసల ప్రభువు శ్రీరామునికి దాసుడను. వాయుపుత్రుడను, శత్రువులను రూపు మాపు నేను హనుమంతుడను అని ప్రకటించుకున్నందుకా సుందరమా? కాదుట. సుందరమంటే ఆనందము. పోయినది దొరికితే ఆనందము.
“నష్ట ద్రవ్యస్య లాభోహి సుందరపరికీర్తితః” జాడ తెలియకపోయిన అమ్మ కనపడటము ఆనందము. అలాగే ఏది పోయినా తిరిగి పొందటానికి సుందరకాండ సహాయపడుతుందిట. అదేనా సుందరమంటే? అది కాదు అంటున్నాడు ముని.
అందమేమిటి అంటే మనలోని ఆనందాన్నీ బయటకు తీసేది అందము. ఏదైనా సౌందర్యము జన సామాన్యమైనది చాలా విచిత్రమైనది. వస్తువుల అందము చూచే కన్నులలో తప్ప ఆ వస్తువులో ఉండదని మనకు తెలిసిన విషయమే. వస్తు సౌందర్యము నిలకడలేనిది. మార్పుకు లొంగిపోయేది. అటు వంటి వస్తు సౌందర్యము సౌందర్యమనిపించుకోదు. కేవలము మనలోని అంతరానందాన్ని బయటకు తెచ్చేది, బయటకు తేవటానికి సహాయము చేసేది అందము. అందగాడు అంటే మనస్సు లోని ఆనందాన్ని బయటకు తెచ్చేవాడు అందగాడు. ఎవరా అందగాడు ఈ కాండ లో అంటే, రామచంద్రప్రభువు. మరి మనము ఈ కాండలో హనుమ గురించి వింటూ రామస్వామిని ఎక్కడ తలుస్తున్నాము? రామస్వామి అంతర్లీనంగా సర్వత్రా ఉన్నాడు. ఈ కాండలో మొదటి రామకథా గానము జరిగింది. 62 వ సర్గలో కనపడుతాడు రామస్వామి మనకు ప్రత్యక్షముగా. హనుమ రామకథను పాడుతాడు. సీతమ్మ మొదట హనుమను చూచి నమ్మదు. ఆ తల్లి హనుమతో
“(వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః ॥
యాని రామస్య లింగాని లక్షణస్య చ వైవర తాని భూయస్స మాచక్ష్య న మాం శోకస్సమావిశేత్॥”)
నరుడైన రామునికి వానరులైన మీకు ఎలా సమాగమనం జరిగింది? రాముని, లక్ష్మణుని ఎలా వర్ణించగలవు?” అని అడుగుతుంది. రాముని వర్ణించమని అడగటములో సీత ఆలోచన, అహంకారి అయిన రావణుడు రాముని వర్ణించడు, పొగడడు కాబట్టి వచ్చిన వాడు రామదూతనో కాదో తెలుస్తుందని అనుకుంది అమ్మ. దానికి సమాధానము విస్తారముగా చెబుతాడు హనుమ...
“రామః కమల పత్రాక్షః సర్వసత్త్వ మనోహరః
రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాతత్మజే॥” అంటూ మొదలుపెడుతాడు.
‘రామః’ ఆనందము కలిగించువాడు రాముడు. రామ అంటే ఆనందము. ‘రమయతి ఇతి రామః’
‘కమల పత్రాక్షః’ కమలపత్ర ముల వంటి కన్నులు కలవాడు. పుండరీకాక్షుడే ఆయన. పుండరీకాక్షుడంటే సాక్షాత్ ఆ మహావిష్ణవు. కేవలము మూడు సార్లు ‘పుండరీకాక్ష’ అంటే సర్వ పాపములు పోతాయి. సాధారణముగా శుచిగా చేసే కర్మలకు, ప్రారబ్ధం కొద్ది శరీర శుచి కుదరక పోతే కేవలము పుండరీకాక్షః అని ముమ్మారు తలచి శుచిగా అవుతారు ఎవరైనా. అంత శక్తివంతమైన నామము “పుండరీకాక్షః”.
పుండరీకాక్షుడు అనగా కమలరేకుల వంటి కన్నులు కలవాడైన ఆ నారాయణుడు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని మధ్యలో ఉండేవాడు. అటు వంటి నారాయణుడే ఇలా సూర్య వంశములో జన్మించి కమల రేకుల వంటి కన్నులతో ఉన్నాడు. ఆయనే రామచంద్రుడు అంటూ చెప్పాడు హనుమ. అంతేనా? అంతే కాదు “సర్వసత్త్వమనోహరః” తన నిరుపమానమైన కాంతితో అన్ని జీవులకు ఆనందమును కలిగించేవాడు. పశుపక్షాదులు, వృక్షాలు, జలము, గాలి అన్ని అంతటా సదా రాముని సమక్షములో సంతోషముగా ఉంటాయి. అన్నింటికీ ఆనందము కలిగించేవాడు రాముడు. శత్రువులు సైతం ఆయనను చూసి, ఆయన రూపానికి మోహితులైనవారే కదా!
వాలిని చంపినప్పుడు తార దుఃఖపడుతూ కూడా రాముని “ తమప్రమేయస్య దురాత్మనస్య” అన్నది. రావణుని మృతదేహము చూసి ఏడుస్తూ కూడా మండోదరి, రామచంద్రుని చూచి “ మహాయోగి పరమాత్మః సనాతనః” అని కదూ అన్నది. ముక్క, చెవులు నష్టమై ఏడుస్తున్న చెల్లిని రావణుడు “ఎవరు చేశారీపని?” అంటూ గద్ధిస్తే శూర్పణఖ ఏమన్నది? “తరుణః, రూప సంపన్నః, సుకుమారః మహాబలః పుండరీకవిశాలక్షః” అని కదూ చెబుతుంది.
“రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః
రాజా సర్వస్య లోకస్య దేవానామివ మానవః” అని మారీచుడు చెబుతాడు. శత్రువులను సైతం మోహింప చెయ్యగలవాడు కదూ రాముడంటే. మరి ఆయన గురించి కోతి నైన నాకు తెలియటములో ఆశ్చర్యమేమున్నది? అమ్మా!! అన్నాడు హనుమ. రాముడు “రూప దాక్షిణ్య సంపన్నః” అంటున్నాడు హనుమ. అంటే బయటి అందము చూచామా మోహింపచేసే అందము కలవాడు. అది సామాన్యమైన అందము కాదు. శత్రువులను సైతం మోహింప చేసే అందము ఆ అందము. లోపలి గుణములా “దాక్షిణ్య సంపన్నః” గుణములలో సర్వ సంపన్నుడు. సర్వ ప్రాణులనూ దయతో చూసే దయ ఆయనది. అది తెచ్చి పెట్టుకున్నది కాదు. “ప్రసూతో”. అనగా జన్మ తహః వచ్చినది. అటు వంటి రూపగుణ సంపన్నుడు మా రాముడు అంటున్నాడు హనుమ. అంతేనా? అంటే అంతే కాదు... అలాంటి వారు ప్రపంచములో మరి లేరా? అన్న అనుమానము కలగవచ్చు మనకు. సీతమ్మ తల్లి కి కలగవచ్చు కదా! అందుకే హనుమ “జనకాత్మజే” అంటూ ముగించాడా శ్లోకము. అదీ హనుమ అంటే. “అమ్మా! అటు వంటి గుణములతో రూప సౌందర్యముతో మరోకరు లేరు. ఉంటే అది నీవే సుమా!!” అంటూ....
అటుపై శ్రీరాముని శరీర సౌందర్యమును నఖశిఖ పర్యంతరము వర్ణించినాడు.
“త్రిస్థిరస్త్రి....... “ అంటూ “దేశకాల విభాగజ్ఞః సర్వలోక ప్రియంవదః” ఇంత విస్తారమైన రామ వివరణ ఉండబట్టి ఇది సుందరమైనదా? కాదుట.
మరి ఇంకేమి? అని విచారించగా కావ్యమనగా అర్థ, శబ్ధ, రస సౌందర్యమా?
రామాయణము ఒక మధుర రచన. అందులో సుందరకాండ అత్యంత మధురము. అలవోకగా సాగే శబ్దార్థాల సౌందర్యము, చదువరుల హృదయాలపై పన్నీరు చల్లుతుంది.
ఈ కాండ అంతా అందమైన శబ్ధములతో, అర్ధములతో, రసముతో కూడినది కాబట్టి సుందరమా? అంటే అంతే కాదు మరి.
సీతా సౌందర్యమా? సీత సౌందర్యము ఎలా ఉన్నది? సీత నార చీరతో, నగలు లేకుండా, జడలు కట్టిన కేశములతో, ఎండి పోయి ఉన్నది కదా... మరి ఆ సౌందర్యామా ముని చెబుతున్నది? ఇటు వంటే భౌతిక విషయానికే ముని కదిలిపోతాడా? బాహ్య సౌందర్యము కన్నా మిక్కిలి మిన్న అయినది ఏమిటి?
శివుడు తపస్సు చేసుకుంటూ వుంటే శివుడే భర్త కావాలని కోరికతో పార్వతి, శివుని సేవ చేసేందుకు వచ్చింది. అమ్మవారు పార్వతి మహా సౌందర్యవతి. ఆమె త్రిపుర సుందరి. ఆమె సౌందర్యము శివుడ్ని కదల్చలేదు. మన్మథుడు బాణము వేసినా శివుడు కదలలేదు. పైపెచ్చు ఆ మన్మథుని బూడిద చేసినాడు. తన సౌందర్యము తన ప్రియుడ్ని కదల్చలేనినాడు ఆ సౌందర్యమేమి సౌందర్యమని అమ్మ తలిచింది. ఆమె వెంటనే ఆ సమస్త ఆభరణాలు వదిలేసి, జుట్టు ముడి కట్టి, నారచీర కట్టి, అక్షమాల చేత పట్టి కేవలము ఆకులు తింటూ కొంత కాలము, అటు పైన కేవలము గాలి మాత్రమే స్వీకరిస్తూ ఘోర తపస్సు చేసింది. ఏఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలాల పూజ జరుపుతూ వున్నది. అటు వంటి సమయములో ఒక వృద్ధ బ్రహ్మచారి వేషములో వచ్చాడు శివుడు. స్వయం నింద చేసుకుంటూ పార్వతి చేయి పట్టుకున్నాడు. చెలికత్తెలతో ఆ వృద్ధుని పారద్రోలమన్నది జగదంబ. “నేనే ఈశ్వరుడ్ని, నీకు దాసుడ్ని..నీ తపస్సు చే కొనపడినాను” అని తన నిజ రూపము చూపాడు శివుడు. ఆనాడు పార్వతి లోకసౌందర్యముతో ఓప్పారుతూ వచ్చినప్పుడు కదలని మహాదేవుడు ఈనాడు కదిల్చిన సౌందర్యమేమిటి? అది కేవలము పార్వతి తపస్సు తప్ప. అంటే పరమాత్మ తపస్సులకే కరుగుతాడు.
సీతమ్మ చేసిన తపస్సు అశోకవాటిలో సాధారణ తపస్సు కాదు. సర్వం త్యదించి సతతము రామ నామము జపిస్తూ, కేవలము రాముని మనమున ఉంచుకు గాలిని మాత్రమే స్వీకరిస్తూ తపించింది. రామునికై తపించినది. రాముడు మాత్రమే తనను రక్షించువాడని నమ్ముకున్నది.
హనుమ
“పృష్ఠమారోహ మే దేవి మా వికాంక్షస్వ శోభనే
యోగమన్విచ్ఛ రామేణ శశాంకేనేన రోహిణీ॥”
అమ్మా! ఓ దేవీ! నా వీపునధిరోహించు. రోహిణి చంద్రుని చేరినట్లు నిన్ను రాముని చేర్చగలను” అని కదా అన్నాడు. దానికి అమ్మ
“భర్తుర్భక్తిం పురస్కృత్వ రామాదన్యస్య వానర।
నాహం స్ప్రష్టుం స్వతో గాత్రమ్ ఇచ్ఛేయం వానరోత్తమ॥”
వానరోత్తమా! నా పాతివ్రత్య ధర్మముననుసరించి నేను శ్రీరాముని తప్ప వేరొక పురుషుని తాకను.
“యది రామో దశగ్రీవమ్ ఇహ హత్వా సబాంధవమ్।
మామితో గృహ్య గచ్ఛేత తత్తస్య సదృశం భవెత్॥” శ్రీరాముడు ఈ దశకంఠుని హరించి నన్ను తీసుకుపోవాలి. అందుకే నేను తపస్సు చేస్తున్నానని చెప్పింది. అమ్మ ఏమి తపస్సు చేస్తున్నది?
రావణుడితో
“అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్।
న త్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా॥” అని చెప్పింది. తనను తాను రక్షించుకోగల శక్తి ఉన్నా, రావణుని భస్వం చేసే శక్కి ఉన్నా రామాజ్ఞ లేదని కదా ఆగింది.
“నాకు నిన్ను భస్మం చెయ్యగల తేజస్సు యున్నది. నీవు భస్మం కావలసిన వాడివి. కానీ అసందేశాత్తు రామస్య” అన్నది జనని.
“తపస్సు చేసుకుంటున్నాను” అని కదూ అన్నది. ఆమె అక్కడ కూర్చొని ఏడుస్తున్నది కదా, ఏమి తపస్సు అని మనకు సందేహము కలుగుతుంది. ఆమె చేసే తపస్సు ‘శరణాగతి’. మనమందు రాముని ప్రతిష్ఠించుకొని ఎల్లప్పుడూ ఆ రామునే తలుస్తూ.... “నాకు నీవే గతి. నీవు తప్ప మిగిలినది నాకు శూన్యం.” అని సీత చెబుతున్నది. పరమాత్మను చేరటానికి ఉత్తమోత్తమమైన పద్ధతి శరణాగతి. నవ విధ భక్తిలో అత్యంత శ్రేష్ఠమైనది శరణాగతి. ఆ శరణాగతి ఏ విధముగా చెయ్యవలెనో చూపినది అమ్మ ఇక్కడ. అది ఎలా ఉంటుందో చూపిన సర్గ ఇది. పరమ పురుషునికి ‘సర్వంసహ నీవు’ అని శరణాగతి వేడటము. లోనా బయటా అంతటా నీవే ఉన్నావు. నీవు తప్ప మరి వేరు లేదు అన్న విషయమును నమ్మి ఆచరించటము. ఆ పరమపురుషుడు తప్ప మిగిలినది గడ్డితో సమమని ప్రకటించటమే సుందరము. ఆ పరమపురుషునికి సర్వస్య శరణాగతే పరమ సుందరము...
సీతమ్మకు రామస్వామి కబురు చెప్పి, ఆమెకు రాముని ముద్రికను ఇచ్చి ఆనందాన్నీ కలిగించినాడు హనుమ. రామయ్యకు సీతమ్మ కబురు చెప్పి, చూడామణిని ఇచ్చి ఆయనలోని దిగులు మాయం చేసి, ఆనందమునిచ్చాడు కాబట్టి సుందరము. రామునికి ఆనందాన్నిచ్చి ఆ స్వామి కౌగిలిని పొందినవాడు హనుమ. ఆయన కదా సుందరము. అందుకే ఇది సుందరకాండ.
ప్రకృతి, పరమాత్మ సంబంధమును చూపు కావ్యంగా రామాయణమును తీసుకుంటే, అది చూపిన కాండ ఇదే. జీవ, పరమాత్మ, గురువును చూపిన కాండ ఇది. జీవుడు సంసారములో పడి కొట్టుకుంటూ ఉంటే, వారికి పరమాత్మను చూపే గురువు హనుమ. ప్రకృతి సీత. పరమాత్మ రాముడు. ఇరువురికీ వారధి హనుమ.
మానవ జీవితములో పరమాత్మ గురువు రూపములో వచ్చి ఒక మంత్రమో, మార్గనిర్దేశమో చేసి ఆవలగట్టును చేర్చే పద్ధతి పరమ సుందరము. అదే భవ బంధాలు తొలిగే మార్గము. ఆ మార్గము చూపిన కాండ ఇదే కాబట్టి ఇది సుందరము. సుందరకాండలో ప్రతి శ్లోకము మంత్రమయము. ఎంతో గూడార్థముతో ఉన్నవి అవి. ఉదాహరణకు తొలి శ్లోకము తీసుకుంటే
“తతో రావణనీతాయాః శత్రుకర్శనః।
ఇయేష పదమన్వేష్టం చారణాచరితే పథి॥” అంటూ మొదలవుతుంది.
తాత్పర్యము: అనంతరము అరివీరభయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతయొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించే ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.
దీని అంతరార్థము విశాలమైనది.
ఈ శ్లోకము పఠించినంత మాత్రాన కోరిన కోరిక తీరుతుందిట. ‘ఉమా సంహిత’లో శివుడే స్వయంగా అమ్మవారికి చెబుతాడు.
‘బ్రహ్మ విద్య’ ఎలా మొదలవుతుందో అలా మొదలవుతోంది ఈ శ్లోకము, ఈ కాండలో. బ్రహ్మవిద్య “అతాతో బ్రహ్మ జిజ్ఞాస” అని ఎలా మొదలవుతుందో అలా ‘అతః’ అన్నా ‘తతో’ అన్నా అదే అర్థము. బ్రహ్మవిద్యకు సాధకుడు మొదట అర్హత సంపాదించుకోవాలి. బ్రహ్మవిద్యకు అధికారమేమంటే “శత్రుకర్శన”. సాధకునికి శత్రువు ఇంద్రియములు. ఇంద్రియములను నిగ్రహించుకొని సాధకుడు సాగాలి. అలా విద్యను సంపాదించుకునేందుకు అధికారము పొందుతాడు. “తతో” అటు పైన, ఆ అధికారము సంపాదించుకున్న తరువాత బ్రహ్మం తెలుసుకోవాలనుకుంటాడు. బ్రహ్మం అంతటా ఉన్నదే. కాని తెలియకుండా పోయింది. దానిని వెతుకటమే ఈ కాండ. ఎక్కడుంది అది మరి? “రావణనీతాయాః”. రావణుడంటే దుఃఖము కలిగించువాడు. అవిద్యయే దుఃఖకారణము. ఆ అజ్ఞానమే అతను. ఆ అజ్ఞానము చేత అపహరింపబడినది సీత. సీత అంటే బ్రహ్మవిద్యే. బ్రహ్మవిద్య అవిద్య చేత కప్పబడిపోయింది. దానిని కనుగొనుట ఈ కాండ యొక్క ఉద్ధేశ్యము.
చారణులు అంటే ఆచరింపచేయువారు, ఆచరించువారు అని అర్థము. అంటే గురువులు. అనగా గురువుల బోధించిన పద్దతిలో సాధకుడు సాగి ఆచరిస్తే అజ్ఞానముచే కప్పబడిన బ్రహ్మవిద్య జాడ తెలుస్తుంది యని అర్థము. అంతర్రిందియాలనూ, బహిర్రింద్రియాలనూ నిలవరించిన సాధకుడు బ్రహ్మవిద్యకు అధికారము సాధించి, అజ్ఞానముచే కప్పబడిన జ్ఞానమైన బ్రహ్మమును గురువుల సహాయముతో తెలుసుకుంటాడని ఈ శ్లోకానికి గూడార్థము. ఇలా ప్రతి శ్లోకానికీ ఎంతో లోతైన అర్థము కలదిగా ఉన్న బ్రహ్మవిద్యా విషయ సంబంధమైనది కాన ఇది పరమ సుందరము. ముని అయిన కవి వాల్మీకి చేత పరమ పురుషుడు చెప్పిన కథే సుందరకాండ.
"సుందరే సుందరో రామః సుందరే సుందరి కథా!
సుందరే సుందరి సీతా,సుందరే సుందరం వనం !!
సుందరే సుందరం కావ్యం,సుందరే సుందర కపి !
సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం?!! "
సర్వ కోరికలు తీర్చి తుదకు ముఖ్యమైన ముక్తిని కూడా ఇచ్చే ఈ సుందరకాండ పారాయణముతో ఈ చైత్రమాసము మరింత ఫలప్రదమైనది. రామనవమితో పూర్తి చేసే పారాయణము అనాదిగా మన సంప్రదాయము. ఈ నవమి ఆ హనుమ మనందరినీ బ్రోచి తరింపచెయ్యుగాక!!
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో