తిరుమల ఏప్రిల్ 21
ఆంజనేయ స్వామి జన్మస్థలంపై ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన చేసింది. అంజనాద్రి తప ఫలంగా ఆంజనేయస్వామి జన్మించారని, తిరుమల కొండపైనే హనుమంతుడు జన్మించినట్లు ఇవాళ టీటీడీ అధికార ప్రకటన చేసింది. ఈ అంశంపై టీటీడీ పండితులు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. దేవతలంతా అంజనాద్రికి వరం ఇవ్వడం వల్లే హనుమంతుడు జన్మించినట్లు టీటీడీ చెప్పింది. హనుమంతుడిని ఇక్కడ కనడం వల్ల తిరుమల కొండలకు అంజనాద్రి అని పేరు వస్తుందని దేవతలు దీవించినట్లు పండితులు తెలిపారు. 12 పురాణాల్లో ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టినట్లు స్పష్టం చేసినట్లు వారు చెప్పారు. వరాహపురాణంలో చెప్పినట్లు వెంకటగిరి అంజనాద్రి అని పండితులు వెల్లడించారు. హంసదూతం అనే కావ్యంలో వెంకటాచలాన్ని అంజనాద్రి అని కీర్తించినట్లు గుర్తు చేశారు. అంజనాద్రి పాలకుడు వెంకటేశ్వరుడు అని ఆ పురాణంలో స్తోత్రాలు ఉన్నట్లు తెలిపారు. అకాశగంగ సమీపం వద్ద ఉన్న జాబాలి తీర్థం వద్ద ఆంజనేయుడు జన్మించినట్లు టీటీడీ నిర్ధారించింది.
అంజనేయ స్వామి ఇక్కడ పుట్టి, పెరిగి, వెంకటేశ్వురస్వామికి సేవ చేశారని అనేక ప్రామాణాలు చెబుతున్నట్లు పండితులు తెలిపారు. పౌరాణపరంగా, సాహిత్యపరంగానే కాకుండా.. శాస్త్రపరంగా కూడా హనుమంతుడి జన్మస్థలం తిరుమల క్షేత్రమే అని చెప్పినట్లు వెల్లడించారు. శాసన, భౌగోళిక పురాణాలు కూడా అంజనాద్రి గురించి వివరించినట్లు చెప్పారు. వాల్మీకి రాసిన రామాయణంలోని సుందరకాండ ప్రకారం కూడా హనుమంతుడు తిరుమల కొండల్లో పుట్టినట్లు ఉందన్నారు. హంపి క్షేత్రం మాత్రం హనుమంతుడి జన్మస్థలం కాదని పండితులు తేల్చారు. దానికి శాస్త్రీయ ప్రమాణాలు లేవన్నారు. జార్ఖండ్‌లో ఉన్న అంజనీ అన్న గుహ ఉన్నదని, దాంట్లో హనుమంతుడు పుట్టినట్లు ప్రచారంలో ఉన్నది, కానీ జార్ఖండ్‌లో హనుమంతుడు పుట్టలేదని టీటీడీ పండితులు తెలిపారు. హంపి నుంచి అంజనాద్రికి 300 కిలోమీటర్ల దూరం ఉంటుందని, అన్ని ప్రమాణాల ప్రకారం తిరుమలే హనుమంతుడి పుట్టిన స్థలమని పరిశోధకులు తేల్చారు.