విశాఖపట్నం, ఏప్రిల్ 21: కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకోవలసిన వ్యక్తుల కోసం రేపు అనగా గురువారం జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు. బుధవారం నాడు ఆయన స్థానిక కలెక్టరేట్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకోవలసిన వ్యక్తులు 39,111 మంది వున్నారని తెలిపారు. వీరిలో కోవీ షీల్డ్ రెండవ డోసు తీసుకోవలసిన వారు 32,352 మం ది వు న్నారని తెలిపారు. కో వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకోవలసిన వారు 6,759 మంది వున్నారని తెలిపారు. కోవీ షీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 6 నుంచి 8 వారాల మధ్య రెండవ డోసు తీసుకోవలసి వుంటుందన్నారు. కోవ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 4 వారాల తరువాత రెండవ డోసు తీసుకోవలసి వుంటుందన్నారు. అందువలన రేపు ఉదయం 7.30 నుంచి రెండవ డోసు వేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాబట్టి మొదటి డోసు వేసుకొని నిర్ణీత సమయం పూర్తి అయిన వ్యక్తులు గురువారం నాడు అదే వ్యాక్సిన్ రెండవ డోసు జిల్లాలో ఎక్కడైనా వేసుకోవచ్చునని వివరించారు. మొదటి డోసు ఏ వ్యాక్సిన్ వేసుకుంటే, రెండవ డోసు కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలని, ప్రజలందరూ ఇది గమనించాలని తెలిపారు. కోవీ షీల్డ్ వ్యాక్సిన్ నగరంలోని కె.జి.హెచ్., ఛాతీ ఆసుపత్రి, మానసిక వైద్య శాల, ఘోషా ఆసుపత్రి, జి.వి.యం.సి. పరిధిలోని 72 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, నర్సీపట్నం మున్సిపాలిటిలోని 3 అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, యలమంచిలి మున్సిపాలిటి లోని 2 అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, గ్రామీణ ప్రాంతంలోని 47 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, ఏజెన్సీ లోని 36 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, ఇంకా జిల్లా అంతటా వున్న 16 వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో వేస్తారు. కో వ్యాక్సిన్ ను నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రి, చెవి ముక్కు గొంతు ఆసుపత్రులలో, కె.జీ.హెచ్. లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో, స్వర్ణ భారతీ ఇండోర్ స్టేడియంలో, అనకాపల్లిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ లో , నర్సీపట్నంలోని టిబి కంట్రోల్ సెంటర్ లో , పాడేరులోని జిల్లా ఆసుపత్రిలో వేస్తారు. నగరంలోని కె.జి.హెచ్. ఆసుపత్రిలో విడివిడిగా ప్రత్యేక బ్లాకులలో రెండు రకాల వ్యాక్సిన్ లు కోవీ షీల్డ్, కో వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. కాబట్టి వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న ప్రతీ ఒక్కరూ రేపు రెండవ డోసు తప్పని సరిగా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్లేటప్పుడు తమ అధార్ కార్డ్ ను వెంట తీసుకొని వెళ్లాలని కోరారు. జిల్లాలో ప్రస్తుతం 60 వేల డోసులు అందుబాటులో వున్నాయని, ఇంకా అదనంగా డోసులు రానున్నాయని తెలిపారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకి రికవరీ అయి 28 రోజులు గడిచిన వ్యక్తులు బ్లడ్, ప్లాస్మా దానం చేయవచ్చునని, కాబట్టి అలాంటి వారు స్వఛ్చందంగా ముందుకు వచ్చి బ్లడ్, ప్లాస్మాను దానం చేసి, ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టరు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, జి.వి.యం.సి. కమీషనర్ డా. జి.సృజన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.సూర్యనారాయణ, ఆంధ్రా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.పి.వి.సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.