YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మిర్చి..బంగారమాయె

మిర్చి..బంగారమాయె

ఖమ్మం, ఏప్రిల్ 22,
తేజా మిర్చి ఖండాంతరాలు దాటుతున్నది.. రంగు, ఘాటులో సాటి లేని వంగడం కావడంతో ఆయా దేశాలు ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఏటా ఖమ్మం నుంచి భారీగా చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌కు ఎగుమతి అవుతున్నది. మూడు దశాబ్దాల క్రితం ‘మహికో’ కంపెనీ తీసుకొచ్చిన ఈ ‘తేజా’ రకం వంగడం ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి సాధించింది. ఏటా ఉత్పత్తి అయ్యే మిర్చిలో 30-40 శాతం దేశీయంగా ఆహార పదార్థంగా వినియోగిస్తుండగా.. మిగిలిన 60-70శాతం పంట ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నది. జిల్లాలో ఏటా సుమారు 40-50 వేల ఎకరాల్లో తేజా రకం సాగవుతున్నది. జిల్లాలో 36,222 మంది రైతులు తేజా రకం మిర్చి సాగు చేస్తున్నారు. వానకాలంలో 55,990 ఎకరాల్లో సాగైంది. దిగుబడి అంచనా 13,99,750 క్వింటాళ్లుగా అధికారులు నిర్ణయించారు.మార్కెటింగ్‌ విషయానికి వస్తే ఖమ్మం మార్కెట్‌కు ఏటా తేజా రకం పంట భారీగా వస్తున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో 100శాతం తేజా మిర్చి వచ్చే ఏకైక మార్కెట్‌ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కావడం విశేషం. పంటను విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులు ఎక్కువగా ఇక్కడి మార్కెట్‌ నుంచే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ వ్యాపారం ఏటా రూ.3 వేల కోట్ల టర్నోవర్‌ ఉంటుందని ఎగుమతిదారులు పేర్కొంటున్నారు.ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు రికార్డు స్థాయిలో లక్ష మిర్చి బస్తాలను తీసుకువచ్చారు.  దాదాపుగా 70 వేల బస్తాలను కార్మికులు దిగుమతిచేశారు. జెండాపాట సమాయానికి గేట్‌ ప్రవేశమార్గంలోకి మరో 30 వేల బస్తాలు వచ్చాయి. అప్రమత్తమైన ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, సెక్రటరీ మల్లేశం ముందస్తు చర్యలు చేపట్టారు. తొలుత జెండాపాటకు ఏర్పాట్లు చేశారు. ఉదయం జెండాపాటలో క్వింటా మిర్చి గరిష్ఠ ధరను రూ.14,700గా ధర నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. కొద్దిసేపటికే కొందరు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని భావించి విషయాన్ని చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్షణం స్పందించిన చైర్మన్‌ సదరు రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఇష్టారీతిన ధరలు పెట్టడం సరికాదని వ్యాపారులకు సూచించారు. సోమవారం నుంచి రెండు ప్రధాన యార్డులనూ మిర్చి క్రయవిక్రయాల కోసం వినియోగిస్తామన్నారు. సాయంత్రం వరకు మిర్చియార్డులో తోలకాల ప్రక్రియ కొనసాగింది.ఖమ్మం నుంచి ఏటా చైనా, థాయ్‌లాండ్‌, వియత్నాం, బంగ్లాదేశ్‌కు తేజా మిర్చి ఎగుమతి అవుతున్నది. వ్యాపారులు కొన్నిసార్లు అమెరికాకూ ఎగుమతి చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని 16 శీతల గిడ్డంగులు అందుబాటులో ఉండగా వాటిలో రెండు కోల్డ్‌స్టోరేజీలను వ్యాపారులు కేవలం ఎగుమతి చేసే పంటకు మాత్రమే వినియోగిస్తున్నారు. శీతల గిడ్డంగుల నిర్మాణం పటిష్టంగా ఉండడంతో ఎక్కువ కాలం మిర్చి నిల్వ చేయడానికి వీలు కలుగుతున్నది. పూర్వకాలంలో పంటను నేరుగా కొనుగోలు చేసిన ఎగుమతిదారులు ప్రస్తుతం స్టెమ్‌ కటింగ్‌ (తొడిమ సగభాగం), స్టెమ్‌లెస్‌ కటింగ్‌ (తొడిమలు పూర్తిగా తొలగించడం) ప్రక్రియ చేపట్టి తమిళనాడులోని చెన్నై పోర్టు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి జరుగుతున్నది. సీజన్‌లో ఖమ్మం మార్కెట్‌కు రోజుకు 40-50 వేల బస్తాలు వస్తుండగా వాటిలో 75శాతానికి పైగా ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతుండడం విశేషం.తేజా మిర్చిని విదేశాల్లో వారి అవసరాలకు తగిన విధంగా వినియోగించుకుంటున్నారు. మార్కెట్లో కొనుగోలు చేసిన పంటను ఖరీదుదారులే కొంతమేరకు ప్రాసెసింగ్‌ చేస్తుండగా మిగిలిన ప్రక్రియ ఆయా కంపెనీల్లో జరుగుతున్నది. తెలుగు రాష్ర్టాల్లో ఇందుకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఐదు ఉండగా కేవలం తెలంగాణలోనే నాలుగు కంపెనీలు ఉన్నాయి. తొడిమలతో ఎగుమతి చేసిన మిర్చిని చైనాలో పెయింటింగ్‌ పరిశ్రమల్లో వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. చిన్న, చిన్న మిర్చి ముక్కలను చైనీయులు మాంసాహారంలో స్టఫ్‌గా వినియోగిస్తున్నారు. ఖమ్మం నగరం సమీపంలో ఏర్పాటు చేసిన చాంగ్‌వాంగ్‌ కంపెనీ, మహబూబాద్‌, హైదరాబాద్‌లో ఉన్న మరో రెండు కంపెనీలు ఇక్కడే మిర్చిని ప్రాసెసింగ్‌ చేస్తున్నాయి.తేజా మిర్చికి ఖరీదుదారులు ఇక్కడే ప్రాసెసింగ్‌ చేయిస్తున్నారు. దీని ద్వారా 10 వేల మంది ఉపాది పొందుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌ పరిధిలో మిర్చి ఖరీదు చేసే పదిమంది వ్యాపారులు రెండేళ్ల క్రితం స్టెమ్‌ కటింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో వాటిని ఆపరేట్‌ చేసే వారికి ఉపాధి దొరుకుతున్నది. ఖమ్మం నగరంతో పాటు సీజన్‌లో ఇక్కడి వ్యాపారులు జిల్లాలోని ఇతర మండలాలతో పాటు పొరుగు జిల్లాలకు పంటను తరలించి అక్కడ కూలీల సహాయంతో తొడిమలు తీయిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి దొరుకుతున్నది.మిర్చి పండిస్తున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత చైనా ఉన్నది. అయినప్పటికీ అక్కడి వారు తెలంగాణ ప్రాంతంలో సాగవుతున్న తేజా మిర్చిని కోరుకుంటున్నారు. ఖమ్మం నుంచీ ఏటా ఎగుమతులు పెరుగుతున్నాయి. తేజా రకం సహజ సిద్ధమైనది కావడం, ఎక్కువ రోజులు నిల్వ సామర్థ్యం ఉండడం, రంగు, ఘాటు విషయంలోనూ నాణ్యత ఉండడం వల్ల విదేశాలు ఇక్కడి మిర్చి కోరుకుంటున్నాయి. ప్రస్తుతం చైనా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు ఎక్కువగా మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల నుంచి మార్కెట్‌ వ్యాపారులు దళారుల ప్రమేయం లేకుండానే నేరుగా విదేశాలకు పంటను ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు వ్యాపారులు ఇక్కడి చైనా కంపెనీకి సరఫరా చేస్తున్నారు.

Related Posts