హర్యానా ఏప్రిల్ 22
కోవిడ్ మహమ్మారికి కట్టుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్ కీలకంగా మారింది. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమార్కుల కన్ను వ్యాక్సిన్లపై పడింది. ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన చోరీ ఘటన మరిచిపోక ముందే మరోసారి హర్యానాలో టీకాల దొంగతనం కలకలం సృష్టిస్తున్నది.జింద్ జిల్లాలోని సివిల్ హాస్పిటల్‌లోని పీపీసీ సెంటర్ నుంచి 1,710 మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్ చోరీకి గురైనట్లు అధికారులు గురువారం పేర్కొన్నారు. 1,270 కొవిషీల్డ్ డోసులు, 440 డోసుల కొవాగ్జిన్ పీపీసీ సెంటర్ నుంచి చోరీకి గురయ్యాయని, అలాగే కొన్ని ముఖ్యమైన ఫైల్స్‌ను సైతం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఓ అధికారి తెలిపారు. సెంటర్ ఇన్‌చార్జి మాట్లాడుతూ మొత్తం జిల్లాకు సరఫరా చేసే వ్యాక్సిన్ ప్రధాన కేంద్రాన్ని తనిఖీ చేస్తామని, ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, టీకాల మాయంపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.