న్యూ ఢిల్లీ ఏప్రిల్ 22
ఇండియాలో కరోనా మహా విలయం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల్లో మన దేశం వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో గత 24 గంటల్లో 3.14 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచంలోనే ఒకే రోజు ఇన్ని కేసులు ఓ దేశంలో నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1.59 కోట్లకు చేరింది.కరోనా సెకండ్ వేవ్.. భారత్‌లో పెను సవాళ్లను విసిరింది. ఇప్పటికే ఆక్సిజన్ అందక అనేక మంది అసువులుబాస్తున్నారు. యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్‌కు భారీ డిమాండ్ ఉన్నది. గతంలో అమెరికా పేరిట ఉన్న పాజిటివ్ కేసుల రికార్డును భారత్ తిరగరాసింది. జనవరిలో అమెరికాలో ఓ రోజు అత్యధికంగా 2,97,430 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఆ కేసు లోడ్‌ను భారత్ దాటేసింది.ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రతి రోజు రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ తారాస్థాయికి చేరలేదు. ఇప్పట్లో కరోనా తన ఉగ్రరూపాన్ని కోల్పోయే ఛాన్సులేదని నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో మహారాష్ట్ర(67,468), యూపీ(33,106), ఢిల్లీ (24,638), కర్నాటక (23,558), కేరళ(22,414)లో అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.