న్యూఢిల్లీ ఏప్రిల్ 22 గోరు చుట్టూ పై రోకలి పోటు...
ముంచు కోస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్ ప్రమాదం అజాగ్రత్త కొంపలు ముంచే ప్రమాదం...నిపుణుల హెచ్చరిక
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశంలోనూ 24 గంటల్లో నమోదవని కేసులు తొలిసారి ఇండియాలో నమోదయ్యాయి. చూస్తుంటే మహమ్మారి అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. దీనికితోడు ఇండియాలో కొత్తగా కరోనా ట్రిపుల్ మ్యుటెంట్ కనిపించిందన్న వార్తలు మరింత భయపెడుతున్నాయి. నిజానికి గత వారమే ఆరోగ్య శాఖ డబుల్ మ్యుటెంట్ కాస్తా ట్రిపుల్ మ్యుటెంట్‌గా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. అందుకు తగినట్లే దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఈ ట్రిపుల్ మ్యుటెంట్ కనిపించింది. ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో దీని ఉద్ధృతి తీవ్రంగా ఉండగా మహారాష్ట్ర, ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌లలోనూ ఇది కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది వ్యాక్సిన్లను, రోగ నిరోధక శక్తిని కూడా బోల్తా కొట్టించగలదన్న వార్తలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
ట్రిపుల్ మ్యుటెంట్ అంటే ఏంటి?
ఇప్పుడు ఇండియాలో కనిపించిన ట్రిపుల్ మ్యుటెంట్ కూడా ఓ కొత్త వేరియంట్. అంటే మూడు భిన్నమైన స్ట్రెయిన్‌లు కలిసి ఒక్కటిగా కలిసిపోయి ఓ కొత్త వేరియంట్‌గా మారాయి. ఇప్పటికే ప్రపంచంలో వివిధ స్ట్రెయిన్‌లు వణికిస్తుండగా.. ఇప్పుడు ట్రిపుల్ మ్యుటెంట్ అనేది ఇండియాతోపాటు ప్రపంచానికి కూడా కొత్త సవాలు విసరనుంది. వైరస్ ఏదైనా ముదిరిన కొద్దీ తన రూపం మార్చుకుంటూ మందులకు, వ్యాక్సిన్లకు చిక్కకుండా వ్యాపిస్తూనే ఉంటుంది. కరోనా కూడా అంతే. అది తొలిసారి కనిపించినప్పటి నుంచీ తన రూపం మార్చుకుంటూనే ఉంది. ఇందులో భాగంగా వైరస్ జన్యుపరమైన మ్యుటేషన్ చెందుతుంది. ఇదే కొత్త వేరియంట్లను సృష్టిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్, ఇండియా వేరియంట్లు ఇవే. వీటినే స్ట్రెయిన్ అని కూడా అంటాం. వీటిలో చాలా వరకు ప్రమాదకరం కాకపోయినా.. కొన్ని మాత్రం సవాళ్లు విసురుతాయి. మానవ కణాల్లోకి వెళ్లేందుకు వైరస్ ఉపయోగించే స్పైక్ ప్రొటీన్‌లో కొన్ని మ్యుటేషన్లు మార్పులు చేస్తాయి.
మ్యుటెంట్ ఎందుకంత డేంజర్?
ఈ వేరియంట్లు తీవ్రమైన అనారోగ్యాన్ని కలగజేయడం లేదంటే వ్యాక్సిన్‌లను జయించడం చేయొచ్చు. ఈ కొత్త ట్రిపుల్, ఇతర మ్యుటేషన్ల వల్ల ఉత్పన్నమయ్యే సవాళ్లను అమెరికాకు చెందిన సీడీసీ వివరించింది.వేగంగా వ్యాపిస్తుంది: వైరస్ మ్యుటేట్ అయిన కొద్దీ అది మనుషుల్లో వ్యాపించే వేగం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు డీ614జీ అనే వేరియంట్ చాలా వేగంగా వ్యాపించినట్లు తేలింది. అంతకుముదు ఉన్న 614డీని మించి ఇది వ్యాపించినట్లు గుర్తించారు. మ్యుటేషన్ చెందని వైరస్‌లతో పోలిస్తే ఇది చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.వ్యాధి తీవ్రత: వైరస్ మ్యుటేషన్ చెందిన కొద్దీ అది కలిగించే వ్యాధి తీవ్రత కూడా పెరుగుతుంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే బ్రిటన్‌లో కనిపించిన బీ.1.1.7 వేరియంట్ వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇవి ఒక్కోసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌కు కూడా దొరకడం కష్టమని తేలింది.
వ్యాక్సినేషన్‌పై ప్రభావం: కరోనా నుంచి గట్టెక్కాలంటే మానవాళి ఆధారపడుతోంది కేవలం వ్యాక్సిన్‌లపైనే. కానీ అలాంటి వ్యాక్సిన్లతో వచ్చిన రోగనిరోధక శక్తిని కూడా ఈ మ్యుటెంట్లు బోల్తా కొట్టించే ప్రమాదం ఉంది. వ్యాక్సిన్‌లు ప్రధానంగా వైరస్ స్పైక్ ప్రొటీన్‌పై దాడి చేస్తాయి. అయితే వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో బహుళ మ్యుటేషన్లను సృష్టించగలిగితే ఈ వ్యాక్సిన్ల నుంచి కూడా అది తప్పించుకునే ప్రమాదం ఉంటుంది.
మరి ఏం చేయాలి?
ఇండియాలో కొత్తగా కనిపించిన ఈ ట్రిపుల్ మ్యుటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను వేగవంతం చేయాలని నిపుణులు చెబుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌తో వైరస్ పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుస్తాయి. అంతేకాదు వైరస్‌కు మందులు, వ్యాక్సిన్లు తయారు చేయడానికి కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ బాగా ఉపయోగపడుతుంది.