న్యూ ఢిల్లీ ఏప్రిల్ 22
చైనా రాయబారి తన బృందంతో పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రాజధాని క్వెట్టాలోని ఓ పేరుమోసిన హోటల్‌లో ఆతిథ్యం కల్పించారు. అయితే వారు బసచేస్తున్న హోటల్ బయట బుదవారం రాత్రి ఓ కారు బాంబు పేలింది. దీంతో నలుగురు మృతిచెందగా, డజన్లకొద్ది గాయపడ్డారు. చైనీస్ అంబాసిడర్ ఉన్న సెరెనా హోటల్ వద్ద పార్క్ చేసిన ఓ కారులో పేలుళ్లు సంభవించాయి. అయితే ఆ సమయంలో చైనా రాయబారి ఆ హోటల్‌లో లేరని పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ చెప్పారు. ఈ పేలుళ్లలో నలుగురు చనిపోగా, 12 మంది గాయపడ్డారని తెలిపారు.కాగా, ఈ పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ గ్రూపూ బాధ్యతవహిస్తున్నట్లు ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. ఓ కారులో ఉంచిన ఐఈడీని పేల్చినట్లు నిర్ధారించారు. గతంలో కూడా బలూచిస్తాన్‌లో ఇలాంటి పేలుళ్లు సంభవించాయి. గతేడాది జూన్‌లో చైనీస్ కంపెనీ పెట్టుబడులు పెట్టిన పాకిస్థాన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లక్ష్యంగా బాంబుదాడి జరిగింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్టీ ఈ దాడికి పాల్పడింది. ఇప్పుడుకూడా అదే సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.