న్యూయార్క్, ఏప్రిల్ 22,
భారత ప్రభుత్వానికి అమెరికా ఫార్మాసూటికల్ కంపెనీ ఫైజర్ మంచి ఆఫర్ ఇచ్చినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. లాభం తీసుకోకుండానే ప్రభుత్వానికి తమ కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని తెలిపారు. ఇండియా కోసం మాత్రమే లాభం చూసుకోని ధరను మేము ప్రతిపాదించాము. ప్రభుత్వ ఇమ్యునైజేషన్ ప్రక్రియలో భాగం కావాలన్నదే మా ఉద్దేశం. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతాయి అని ఫైజర్ అధికార ప్రతినిధి తెలిపారు.ఇండియాలో అమెరికా వ్యాక్సిన్ల ధరలపై వచ్చిన కొన్ని వార్తలను ఖండిస్తూ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ధనిక, మధ్య ఆదాయ, పేద దేశాలకు ఒక్కో విధంగా తమ వ్యాక్సిన్ల ధరలను నిర్ణయించినట్లు ఫైజర్ తెలిపింది. ప్రపంచంలో అందరికీ సమానంగా తమ కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కేవలం ప్రభుత్వాలకే వ్యాక్సిన్లు సరఫరా చేయడం అనేది అందులో భాగమే అని చెప్పింది. ఇండియా విషయంలోనూ ఇదే అనుసరిస్తామని తెలిపింది.కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియాలో విదేశీ వ్యాక్సిన్లకు అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు చెందిన ఫైజర్‌తోపాటు మోడెర్నా, జాన్సన్ అండర్ జాన్సన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం ఫైజర్ అమెరికాలో ఒక్కో వ్యాక్సిన్ డోసుకు 19.5 డాలర్లు, యూరప్‌లో 23 డాలర్లు వసూలు చేస్తోంది.