YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కమార్

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కమార్

రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ నామ్) పరిధిలోకి రాష్ట్రంలోని రైతులందరూ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయోత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయలు అనే అంశంపై వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా వ్యవసాయోత్పతులకు మార్కెట్ సదుపాయాలు కల్పిస్తున్న తీరుతెన్నులపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు. రాష్ట్రంలో మోడ్రన్ రైతు బజార్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబోయే రైతు బజార్ల సంఖ్యను తెలిపారు. రాష్ట్రంలో 22 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో ఈ నామ్ వ్యవస్థను అమలు చేస్తున్నామని, రైతు బంధు పథకం కింద 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.54.07 కోట్లతో 4,723 మందికి లబ్ధి చేకూర్చామని వివరించారు. ఈ ట్రేడ్ వాల్యూ, ఆన్ లైన్ లో రైతులకు పేమెంట్ లు చెల్లింపులో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 22 మోడ్రన్ రైతు బజార్లగా తీర్చిదిద్దామన్నారు. 35 రైతు బజార్లలో ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మోడ్రన్ రైతు బజార్లలో కూరగాయాల ధరలు తెలిసే విధంగా ఎల్.ఈ.డీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోల్డ్ స్టోరేజీలు, కంప్యూటరైజ్డ్ తూకాలు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిపై సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, మే నెల నాటికి  మోడ్రన్ రైతు బజార్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మోడ్రన్ రైతు బజార్లలో గ్రీనరీకి పెద్దపీట వేయాలన్నారు. పారిశుధ్యం మెరుగుదలకు విజిటబుల్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ముఖ్యంగా ఆర్గానిక్ కూరగాయల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, వాటి ధరలు తెలిసేలా బోర్డులు నెలకొల్పాలని సీఎస్ ఆదేశించారు. వ్యవసాయోత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాలన్నారు. ఇందుకోసం ఈ నామ్ పరిధిలోకి రైతులు వచ్చేలా చైతన్యపర్చాలన్నారు. ఈ నామ్ వల్ల దళారీ వ్యవస్థకు అడ్డుకట్టపడుతుందని, ఆన్ లైన్ ద్వారా అత్యధిక మంది వినియోగదారులను కలిసే అవకాశం రైతులకు ఉంటుందని, దీని వల్ల తన ఉత్పత్తులకు మెరుగైన ధర పొందే అవకాశం వారికి కలుగుతుందని అన్నారు. ఈ నామ్ ద్వారా లబ్ధిపొందిన రైతుల విజయగాథలను పత్రికలు, న్యూస్ చానల్ లో వచ్చేలా చూడాలన్నారు. ఈ నామ్ అమలు చేస్తున్న ఏఎంసీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయలు కల్పించాలన్నారు. ముఖ్యంగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందజేసే నిధులతో పాటు రైతుల నుంచి వసూలు చేసే పన్నులతో కలిపి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. 

Related Posts