YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తాము అధికారంలోకి వస్తే యువతకు కోటి ఉద్యోగాలు మహిళల భద్రత కోసం చర్యలు కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల

తాము అధికారంలోకి వస్తే యువతకు కోటి ఉద్యోగాలు               మహిళల భద్రత కోసం చర్యలు   కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల

వచ్చే నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో యువతకు కోటి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, స్మార్ట్‌ఫోన్లను అందిస్తామని పేర్కొన్నారు.  దీంతో పాటు మహిళల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశాలివీ.. 

* కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ అని పిలిచే బెంగళూరు ఇదే రాష్ట్రంలో ఉన్నందుకు మనం సంతోషపడాలి. ఇలాంటి రాష్ట్రానికి ఊతం అందిస్తే మన దేశ ప్రతిష్ఠను అమాంతం పెంచుతుంది. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఈ అంశంపైనే దృష్టిసారిస్తుంది.

* మహిళలు, పిల్లల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. శిక్షలను కఠినతరం చేస్తాం.

* ప్రధాని మన్‌ కీ బాత్‌ ప్రజలు వినడం కాదు... ప్రజల మనసులో మాటను కాంగ్రెస్‌ వింటుంది.

* ఇంతకు ముందు కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన దాదాపు 95% ఎన్నికల హామీలను అమలు చేశాం. 

*  కర్ణాటక ప్రజలతో మంచి అనుబంధం ఉన్న వీరప్ప మొయిలీ వంటి పేరున్న సీనియర్‌ నాయకులు ఈ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారు.

* కర్ణాటక ప్రజలంటే ఏంటో భాజపా కంటే మాకే ఎక్కువ తెలుసు. ఇక్కడి ప్రజల సిద్ధాంతాన్ని మేం గౌరవిస్తాం. బసవన్న సిద్ధాంతంపై మాకెంతో గౌరవం ఉంది. మాకు ఏ ఒక్క జిల్లా, ప్రాంతంపైనా ప్రేమలేదు. అందర్నీ సమానంగా చూస్తాం.

* భాజపా మేనిఫెస్టో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలతో నిండిపోయి ఉంది. అందులో అవినీతిని నిర్మూలిస్తామని ఎక్కడా ఉండదు. ఎందుకంటే వారి ప్రభుత్వమే అవినీతితో కూడుకుంది. ఇప్పటికే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి విషయంలో అది అర్థమైంది.

* దేశంలోని ప్రజలందరి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పిన ప్రధాని మంత్రి ఇప్పటి వరకు కనీసం ఒక్క పైసా కూడా ఖాతాలో వేయలేదు. అవినీతి రహిత భారత్‌ను నిర్మిస్తామని అన్న మోదీజీ ఇప్పుడు అవినీతి పరులను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. రాఫెల్‌ కుంభకోణం, అమిత్‌ షా కొడుకు అవినీతి చరిత్రలే ఇందుకు సాక్ష్యం.

* రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామని నమ్మబలికిన మోదీ.. ఇప్పుడు అదే రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నా చోద్యం చూస్తున్నారు. భాజపా వీరి విషయంలో కూడా మాట మీద నిలబడలేదు.

* మా మేనిఫెస్టో ద్వారా కర్ణాటక ప్రజల గొంతుక వినిపించాలనుకుంటున్నాం.

* వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు ఇస్తాం. యువతకు స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తాం.

కర్ణాటకలో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. మే 15న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.

Related Posts