వాషింగ్టన్ ఏప్రిల్ 24
ఇండియాలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ ఆస్ట్రాజెనెకా, ఇతర కొవిడ్ వ్యాక్సిన్లను పంపించాలని అమెరికాలోని బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తోపాటు అక్కడి చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ ఇండియన్ అమెరికన్లు బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న ఇండియా, బ్రెజిల్‌లాంటి దేశాలకు స్టోరేజ్‌లో ఉన్న కోట్లాది వ్యాక్సిన్ డోసులను పంపించాలని యూఎస్ చాంబర్ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యాక్సిన్లు అమెరికా కంటే ఆ దేశాలకే ఇప్పుడు ఎక్కువ అవసరమని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైరన్ బ్రిలియాంటె అన్నారు. జూన్ కల్లా అమెరికాలోని వ్యాక్సిన్ తయారీదారులు ప్రతి అమెరికన్‌కు సరిపడా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలరని, అలాంటప్పుడు ఎక్కువగా ఉన్న వ్యాక్సిన్లు అమెరికాకు అవసరం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం మహమ్మారి నుంచి ఎవరో పూర్తిగా బయటపడలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్‌కు వ్యతిరేక పోరాటంలో అంతర్జాతీయ సమాజం మద్దతు కావాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కోరిన తర్వాత యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది. ఇండియా ప్రపంచానికి సాయం చేస్తుందని, అందువల్ల ఇండియాకు కచ్చితంగా సాయం చేయాల్సిందే అని జైశంకర్ కోరారు. ఇండియాకు అత్యవసరమైన మందులను సరఫరా చేయడంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెలీనా పోర్టర్ చెప్పారు. ఇండియాలో ఉన్న కొవిడ్ పరిస్థితులు ప్రపంచానికే ఆందోళనకరమని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి రషీదా తాలిబ్ కూడా దీనిపై స్పందిస్తూ.. ఇండియాకు అమెరికా కచ్చితంగా సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక భారతీయ అమెరికన్లు, బైడెన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్లు కూడా ఇండియాకు సాయం చేయాలని అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.