న్యూ ఢిల్లీ ఏప్రిల్ 24
మయన్మార్‌లో హింస తీవ్రతరమవుతోంది. ఫిబ్రవరి 1న దేశాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న నాటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు 740 మంది మరణించినట్లు ఏఏపీపీ (అసిస్టెన్స్ అసోసియేసన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్) తెలిపింది. 3,371 మంది ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారని తెలిపింది. యాంగోన్‌లోని సాంచాంగ్ టౌన్‌షిప్, ష్వేపైథార్ విచారణ కేంద్రం నుంచి విడుదలైన 17 ఏళ్ల బాలిక పట్ల నం.24 పోలీస్ స్టేషన్ సిబ్బంది దాడి చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తూ తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారని ఏఏపీపీ పేర్కొంది. యాంకిన్ టౌన్‌షిప్ నుంచి బాంబుదాడులకు సంబంధించి ఒకే విచారణ కేంద్రంలో అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరు మహిళలను సైతం దారుణంగా చితకబాదారని తెలిపింది. ఇందులో ఓ మహిళపై మెటల్ రాడ్డుతో దాడి చేశారని, మిలటరీ జుంటా మహిళా అధికారులను వినియోగించడం లేదని, విచారణ సమయంలో పురుష సైనికులను ఉపయోగిస్తోందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ శనివారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. గత ఫిబ్రవరిలో మయన్మార్ సైన్యం పౌర ప్రభుత్వాన్ని కూల్చి, దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అలాగే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) నాయకురాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు దేశ అధ్యక్షుడు యు విన్‌మైంట్‌ను అదుపులోకి తీసుకుంది. దీంతో తిరిగి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ మయన్మార్ పౌరులు సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు.