భువనేశ్వర్ ఏప్రిల్ 24, ఒడిశాలో పంది తల,చేప చర్మాన్ని పోలిన వింత శిశువు జననం నిలకడగా మహిళ ఆరోగ్యం... ఐసీయూలో పెట్టి శిశువును చికిత్స
ఒడిశాలో మరో వింత శిశువు జన్మించింది. ఈ నెల 11న ఒడిశాకు చెందిన ఓ మహిళ రెండు తలల శిశువుకు జన్మనిచ్చిన ఘటనను మరువకముందే.. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన మరో మహిళ పంది తలను పోలిన తల, చేప చర్మాన్ని పోలిన చర్మంతో ఉన్న మరో వింత శిశువుకు జన్మనిచ్చింది. ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా బెర్హంపూర్‌లోని ఓ ఆస్పత్రిలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. బెర్హంపూర్ పట్టణ సమీపంలోని బట్టకుమార గ్రామానికి చెందిన ఓ 30 ఏండ్ల మహిళ 8 నెలల గర్భిణి. అయితే గురువారం రాత్రి ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు బెర్హంపూర్‌లోని మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ గర్భిణి పరిస్థితిని పరీక్షించిన వైద్యులు నెలలు నిండకపోయినా సిజేరియన్ చేసి శిశువును బయటికి తీశారు. అయితే 2.40 కిలోల బరువున్న ఆ శిశువు ఆకారాన్ని చూసి అంతా షాకయ్యారు.
ఇలా పంది తలను పోలిన తల, చేప చర్మాన్ని పోలిన చర్మంతో శిశువు జన్మించడం అత్యంత అరుదని బెర్హంపూర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మిశ్రా చెప్పారు. ఇలాంటి శిశువు జన్మించడాన్ని హర్లేక్విన్ ఇక్థియోసిస్ అనే రుగ్మత కారణంగా ఇలాంటి వింత శిశువులు జన్మిస్తుంటారని ఆయన తెలిపారు. ABCA 12 జన్యువులో జరిగే ఉత్పరివర్తనలే హర్లేక్విన్ ఇక్థియోసిస్ అనే రుగ్మతకు దారితీస్తాయని చెప్పారు.ABCA 12 జన్యువులోని ప్రొటీన్ జీవుల కణాల్లోని కొవ్వుల రవాణాలో ప్రధానపాత్ర పోషిస్తుందని, అంతేగాక అది చర్మంలోని బాహ్యపొరను ఉత్పత్తి చేస్తుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మిశ్రా వెల్లడించారు. అయితే, ABCA 12 జన్యువులో ఉత్పరివర్తనల కారణంగా ABCA 12 ప్రొటీన్ అసలే ఉత్పత్తి కాకపోవడంగానీ, పాక్షికంగా ఉత్పత్తి అవడంగానీ జరుగుతుందన్నారు. దాంతో కణాల్లో కొవ్వుల రవాణా సరిగా జరుగక చర్మం పైపొర అస్‌వ్యస్తంగా పొలుసులు పొలుసులుగా ఉంటుందని చెప్పారు. వింత శిశువుకు జన్మనిచ్చిన మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, శిశువును ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అయితే ఇలాంటి వింత శిశువులు ఎక్కువగా కాలం జీవించి ఉండటం కష్టమని చెప్పారు. ముఖ భాగాల వింత అమరిక కారణంగా ఈ శిశువుకు శ్వాస తీసుకోవడం, ఆహారం తీసుకోవడం ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నదన్నారు. బాధిత మహిళకు ఇది నాలుగవ కాన్పు అని, ఇప్పటికే మూడు కాన్పుల్లో ఇద్దరు శిశువులు మరణించగా ఒక్కరు మాత్రమే బతికి ఉన్నారని తెలిపారు.